అమరావతిలో ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రంగా ఖండించారు. భవిష్యత్ తరాలకు ఆయన త్యాగనిరతిని చాటిచెప్పాలనే సంకల్పంతోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, ఇది తమ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేర్చుకోవడమేనని ఆయన స్పష్టం చేశారు. కేవలం దోపిడీలకు అలవాటుపడిన వైసీపీ నేతలకు త్యాగాల విలువ తెలియదంటూ ఆయన ఎద్దేవా చేశారు.
గత ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైందని నిమ్మల విమర్శించారు. వైసీపీ హయాంలో రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని తాము అధికారంలోకి వచ్చాక ఐసీయూలోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి తన పాలనలో ఆర్యవైశ్యులకు తీవ్ర అన్యాయం చేశారని, సొంత కుటుంబ సభ్యులను కూడా మోసం చేసిన చరిత్ర ఆయనదని మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దుకుంటూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తోందని మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి మోదీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి రాష్ట్రంలో పటిష్టమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించేందుకు కృషి చేస్తున్నారని వివరించారు. రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన పొట్టి శ్రీరాములు విగ్రహంపై రాజకీయం చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.

