AP

ఎన్నికల షెడ్యూల్ వేళ సంచలనం… టీడీపీలోకి వైసీపీ ఎంపీ..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు లోక్ సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు మాగంటకు కుండువా కప్పి ఆహ్వానించారు.

 

వీరితోపాటు అద్దంకి నియోజకవర్గానికి చెందిన బాచిన చెంచు గురటయ్య, బాచిన కృష్ణచైతన్య, ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి రాకతో ప్రకాశం జిల్లా రాజకీయం మొత్తం తారుమారైందని, దర్శి నుంచి పోటీచేస అభ్యర్థిని కూడా త్వరలోనే ప్రకటించబోతున్నట్లు చంద్రబాబు తెలిపారు.

 

ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని, ప్రజలంతా ఈరోజు కోసమే ఎదురు చూశారని, వైసీపీకి నో ఛాన్స్ అని ఐదుకోట్ల ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్నారని చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఘనవిజయం ఖాయమని, ప్రజలందరికీ మంచిరోజులు వచ్చాయని, ఏపీని సర్వతోముఖాభివృద్ధి చేస్తానన్నారు. అన్ని పార్టీల నాయకులు ఓటు బదిలీ సజావుగా అయ్యేలా చూడాలని, రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కొంతలో కొంత త్యాగం చేయకతప్పదన్నారు.

 

ఎన్నికల షెడ్యూల్ వేళ మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లోనే ఆయన టీడీపీ ఎంపీగా ఒంగోలు నుంచే విజయబావుటా ఎగరవేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరి అక్కడినుంచే ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం తాను కాకుండా తన కుమారుడు రాఘవరెడ్డిని పోటీచేయించాలనే యోచనలో ఆయన ఉన్నారు.

 

దీనికి ఒంగోలు లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని తన అనుచరులు, సన్నిహితులతో సమావేశాలు కూడా జరిపారు. కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు అందరూ సహకరించాలని కోరారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాగుంట రాఘవరెడ్డి కొద్దిరోజులు జైలుకు వెళ్లి తర్వాత అప్రూవర్ గా మారారు. ఆ సమయంలో పార్టీ నుంచి ఎటువంటి సహకారం అందలేదనే భావనతో ఉన్న శ్రీనివాసులరెడ్డి చివరకు వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు.