AP

ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..

ఏపీలో ఎన్నికల సమరానికి ముహూర్తం ఖరారైంది. ఏపీలోని 25 ఎంపీ, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించింది. ఏపీలో ఒకే విడతలో అన్ని స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకటనతో వెంటనే కోడ్ అమల్లోకి రానుంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం వ్యూహాలతో సిద్దం అవుతున్నాయి. ఇప్పుడు షెడ్యూల్ ప్రకటనతో ఏపీలో అసెంబ్లీ సమరం మొదలైంది. పోలింగ్, కౌంటింగ్ తేదీలను ఎన్నికల సంఘం వెల్లడించింది.

 

ఏపీలో పోలింగ్ ఇలా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏపీలోని 25 ఎంపీ, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ తేదీలు ఖరారయ్యాయి. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ మేరకు ఈ నెల 16 న ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. 18 వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 25 వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. మే 13 న పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

హోరా హోరీ 2019 ఎన్నికల సమయంలో మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ఈ సారి ఆరు రోజులు ఆలస్యంగా షెడ్యూల్ ప్రకటించారు. ఏప్రిల్ 11న ఎన్నికలు జరగ్గా, 2019 మే 23న ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. కాగా, ఆ ఎన్నికల్లో 151 స్థానాలతో వైసీపీ ప్రభుత్వం విజయం సాధించింది. మే 30న ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసారు. ఇక, ఇప్పుడు ఏపీలో ఎన్నికల సమరం హోరా హోరీగా మారింది. జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి. మరో వైపు కాంగ్రెస్, వామపక్షాలు మరో కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. వైసీపీ సింగిల్ గా పోటీ చేస్తోంది. ఈ రోజు వైసీపీ తమ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్దుల జాబితా ప్రకటన చేసింది.

 

ఎన్నికల యుద్దం అయితే, ఎన్నికల షెడ్యూల్ విడుదలతో రాష్ట్రంలో కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం కొనసాగినా…సాధారణ పరిపాలనా వ్యవహారాలకే పరిమితం కానుంది. విధాన పరమైన నిర్ణయాలకు ఎన్నికల సంఘం అనుమతి తప్పని సరి. ఇదే సమయంలో రాష్ట్రంలో ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పరిశీలకులను నియమించింది. షెడ్యూల్ విడుదలతో పార్టీలు తమ ప్రచారం ముమ్మరం చేయనున్నాయి. మేనిఫెస్టోల ప్రకటనకు ముహూర్తం ఖరారు చేసాయి. వైసీపీ నుంచి జగన్ ఒక్కరే ప్రధాన స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. కూటమి నుంచి ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర మంత్రులు, చంద్రబాబు, పవన్ ప్రచారం చేయనున్నారు. దీంతో..ఇప్పుడు ఏపీలో ఎన్నికల యుద్దానికి అంతా సిద్దమయ్యారు.