National

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు..

సార్వత్రిక ఎన్నికల(Lok Sabha election 2024)కు ముందు కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా అధిక ఇంధన ధరలతో అవస్థలు పడుతున్న వాహనదారులకు ఉపశమనం కలిగించే ప్రకటన చేసింది. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ. 2 చొప్పున తగ్గిస్తున్నట్లు గురువారం రాత్రి వెల్లడించింది.

 

చమురు మార్కెటింగ్ కంపెనీలు సవరించిన ఈ ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను దేశ వ్యాప్తంగా సవరిస్తున్నట్లు సమాచారం ఇచ్చాయని పెట్రోలియం శాఖ పేర్కొంది.

 

ఈ ధరల తగ్గింపు నిర్ణయం వాహనదారులకు ఊరటనిస్తుందని, డీజిల్‌తో నడిచే 58 లక్షల గూడ్స్ వాహనాలు, ఆరు కోట్ల కార్లు, 27 కోట్ల ద్విచక్ర వాహనాల నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని వెల్లడించింది. లీటర్ పెట్రోల్‌పై రూ. 2 తగ్గిస్తూ తీసుకున్న తాజా నిర్ణయంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.72, ముంబైలో రూ. 104.21, కోల్‌కతాలో 103.94, చెన్నైలో రూ. 100.75గా ఉండనుంది.

 

ఇక, డీజిల్‌పై రూ. 2 తగ్గించడంతో ఢిల్లీలో రూ. 87.62కాగా, ముంబైలో రూ. 92.15, కోల్‌కతాలో రూ. 90.76, చెన్నైలో 92.34కు తగ్గనుంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ తనకు ఎల్లప్పుడూ కోట్లాది భారతీయుల సంక్షేమం, సౌలభ్యమే లక్ష్యమని మరోసారి నిరూపించుకున్నారని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురీ ట్వీట్ చేశారు.

 

కాగా, త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 సీట్లకుపైగా గెలిచేందుకు మోడీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులోభాగంగానే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా వంట గ్యాస్ ధర రూ. 100 తగ్గించింది. ఆ తర్వాత పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.