- ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కొమ్మినేని శ్రీనివాసరావు
- వచ్చే నెల 7న ముగియనున్న శ్రీనాథరెడ్డి పదవీకాలం
- రెండ్రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనున్న ఏపీ ప్రభుత్వం
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సహకారం అందించిన వారందరికీ సీఎం జగన్ వరుసగా నామినేటెడ్ పదవులు కట్టబెడుతున్నారు. ఇదే క్రమంలో ఇవాళ ఇద్దరికి నామినేటెడ్ పదవులు ప్రకటించారు. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇవాళ నామినేటెడ్ పదవులు అందుకున్న వారిలో ఏపీ ఫిలిండెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా పోసాని కృష్ణమురళితో పాటు ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా కొమ్మినేని శ్రీనివాసరావు నియమితులయ్యారు.
ఏపీలో వివిధ మీడియా సంస్ధల తరఫున సీనియర్ జర్నలిస్టుగా బాధ్యతలు నిర్వర్తించిన కొమ్మినేని శ్రీనివాసరావు ప్రస్తుతం సాక్షిటీవీలో ఉన్నారు. వైఎస్ జగన్, వైసీపీ తరఫున గట్టిగా గళం వినిపిస్తున్న జర్నలిస్టుల్లో ఒకరైన కొమ్మినేనికి ప్రభుత్వం ప్రెస్ అకాడమీ ఛైర్మన్ బాధ్యతలను అప్పగించింది. ఇప్పటివరకూ ఆ బాధ్యతల్లో ఉన్న మరో సీనియర్ జర్నలిస్ట్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి పదవీకాలం తాజాగా ముగిసింది. దీంతో ఆయన స్ధానంలో కొమ్మినేనిని నియమించారు. రెండేళ్ల పదవీకాలంతో కేబినెట్ హోదాలో కొమ్మినేనిని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా నియమించారు.