CINEMA

తారకరత్న తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన డాక్టర్స్

యువగళం యాత్రలో స్పృహతప్పి పడిపోయిన నందమూరి తారకరత్న ఆరోగ్యం ఇంకా కుదురుకోలేదని తాజాగా వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం బెంగుళూరులోని నారాయణ్ హృదయాలయలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్యం విషమంగానే ఉందని వైద్యులు ప్రకటించడంతో ఇటు అభిమానుల్లో అటు కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. తారకరత్న ఆరోగ్యంపై నారాయణ హృదయాలయ వైద్యులు తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసారు. ఈ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అన్ని రకాల తారకరత్నకు అత్యుత్తమ చికితస అందిస్తున్నామని వైద్యులు ప్రకటించారు. వెంటిలేటర్‌ తో పాటు ఇతర అత్యాధునిక పరికరాల సపోర్టుతో తారకరత్నకు చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు. తారకరత్నకు ఎక్మో మాత్రం ఇప్పటి వరకు అందించలేదని, అది అవసరం లేదని వైద్యబృందం ప్రకటించింది. ఇదిలా ఉండగా తారకరత్నకు వైద్యం అందిస్తున్న తీరు, దానికి తారకరత్న స్పందిస్తున్న తీరు, తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు వివరంగా తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు వైద్య నిపుణులు.

కుప్పంలో నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర ప్రారంభం సందర్భంగా పాల్గొన్న తారకరత్న.. ఒక్కసారిగా కుప్పకూలడం తెలిసిన విషయమే. అయితే వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక వెంటనే చికిత్స ప్రారంభించిన వైద్యులు అన్ని రకాల అత్యుత్తమ చికిత్సలు అందిస్తున్నారు. ముందు కుప్పంలోనే చికిత్స అందించినా, తర్వాత ఆరోగ్య పరిస్థితి సమీక్షించి బెంగళూరులోని నారాయణ హృదయాలకు తరలించారు. ప్రస్తుతము తారకరత్న నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో వైద్యులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ నందమూరి అభిమానులను, టీడీపీ శ్రేణులను కలవరపరుస్తోంది. ఇంకా కోలుకోలేదని వైద్యులు ప్రకటించేసరికి వారింకా శోకంలోనే మునిగిపోయారు. అయితే తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చికిత్స అందిస్తున్నామని, త్వరలోనే ఆశాజనకంగా తారకరత్న ఆరోగ్యం సెట్ అవ్వచ్చని భావిస్తున్నారు. త్వరలోనే తారకరత్న మళ్ళీ మాములు మనిషిగా, ఆరోగ్యంగా అవ్వాలని అంతా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు.