APCINEMA

వేగంగా ఏపీలో రాజకీయ సమీకరణాలు

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్దమవుతున్నాయి. కీలక నేతలకు పార్టీలు గాలం వేస్తున్నాయి. అందులో భాగంగా నేతల జంపింగ్స్ పెరిగాయి. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా టీడీపీ అడుగులు వేస్తోంది. తాజాగా గుంటూరు జిల్లా సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ నుంచి పార్టీలోకి ఆహ్వానించిన టీడీపీ..ఇప్పుడు కాషాయం పార్టీకి చెందిన మరో ముఖ్య నేత టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దమైంది. జనసేన – టీడీపీ పొత్తు వేళ ఈ నేత టీడీపీ ఎంట్రీ ఆసక్తి కరంగా మారుతోంది. ముఖ్య నేతలకు సన్నిహితుడుగా.. ఏపీ బీజేపీ నుంచి మాజీ మంత్రి టీడీపీలో చేరతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. సుదీర్గ రాజకీయ నేపథ్యం ఉన్న మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ త్వరలో సైకిల్ ఎక్కుతారని చెబుతున్నారు. కైకలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరటంతో ఇప్పుడు అక్కడ టీడీపీకి బలమైన నేత అవసరం. గతంలో బీజేపీ నుంచి కామినేని శ్రీనివాస్ 2014లో కైకలూరు ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు కేబినెట్ ఆరోగ్య శాఖా మంత్రిగా పని చేసారు. ఎన్నికలకు కొద్ది రోజులు ముందు 2014లో బిజెపిలో చేరి పార్టీలో క్రియా శీలకంగా వ్యవహరించిన ఏపీకి చెందిన ముఖ్య నేత మద్దతుగా సీటు దక్కించుకున్నారు.

కామినేనికి అటు జనసేనాని పవన్ ..టీడీపీ అధినేత చంద్రబాబుతో సత్సంబంధాలు ఉన్నాయి. ప్రజారాజ్యంలోనూ కామినేని పని చేసారు. 2009 ఎన్నికల్లో కైకలూరు నుంచి ప్రజారాజ్యం అభ్యర్ధిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి జయమంగళం వెంకట రమణ చేతిలో ఓడిపోయారు. పవన్ – చంద్రబాబు మధ్య కీలకంగా కామినేని 2014 ఎన్నికల్లో గెలిచిన తరువాత చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీ నుంచి పని చేసిన ఇద్దరు మంత్రుల్లో ఒకరిగా ఉన్నారు. అదే సమయంలో జనసేన అధినేత పవన్ – చంద్రబాబు సమావేశాల నిర్వహణలో కీలక భూమిక పోషించారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన సమయంలో ఏపీలోని ఇద్దరు బీజేపీ మంత్రులు చంద్రబాబు ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు. అప్పటి నుంచి బీజేపీలోనే కామినేని కొనసాగుతున్నారు. బీజేపీలో ఆయన పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నా..ప్రస్తుతం పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో దూరం కావాలని నిర్ణయించినట్లు సమాచారం.అందులో భాగంగా.. ఇప్పుడు టీడీపీలోకి వెళ్లేందుకు సిద్దమయ్యారని చెబుతున్నారు. టీడీపీ – జనసేన పొత్తు వేళ రెండు పార్టీల అధినేతలతో సత్సంబంధాలు ఉండటం కూడా ఆయనకు కలిసి వచ్చే అంశం. అయితే, బీజేపీతోనూ పొత్తు ఉండాలని టీడీపీ కోరుకుంటోంది. దీంతో..బీజేపీ నేతల చేరిక పైన నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు కన్నా ఎంట్రీతో ఆసక్తి ఉన్న ఇతర నేతలకు లైన్ క్లియర్ అయింది.