World

రష్యా-ఉక్రెయిన్ మధ్య రోజుల తరబడి హోరాహోరీగా యుద్ధం

వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య రోజుల తరబడి హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోంది. ఈ నెల 24వ తేదీతో ఈ యుద్ధానికి ఏడాది పూర్తయింది. ఇన్ని రోజులుగా నిరాటంకంగా ఈ రెండు దేశాలు తలపడుతూనే వస్తోన్నాయి.

నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న ఈ పోరులో ఉక్రెయిన్‌లోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు.

ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యాను పాశ్చాత్య దేశాలన్నీ బహిష్కరించాయి. ఆర్థిక, వాణిజ్య, దౌత్యం.. ఇలా అన్ని రకాల సంబంధాలను తెంచుకున్నాయి. రష్యాపై అనేక ఆంక్షలను కూడా విధించాయి. నిషేధాజ్ఞలను జారీ చేశాయి. అదే సమయంలో ఉక్రెయిన్ కు అండదండలను ప్రకటించాయి ఆయా దేశాలన్నీ. భారీగా యుద్ధ సామాగ్రిని అందజేస్తోన్నాయి. రష్యా దాడిలో ధ్వంసమైన నగరాలను పునరుద్ధరించుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్నీ ప్రకటించాయి.

తాజాగా- రష్యా, చైనా సంబంధాలపై అమెరికా సరికొత్త అనుమానాలను వ్యక్తం చేస్తోంది. రష్యాకు చైనా అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను సరఫరా చేస్తోందని భావిస్తోంది. దీనికి తగిన సాక్ష్యాధారాలను కూడా సేకరించినట్లు అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ విలియం బర్న్స్ చెప్పారు. ఉక్రెయిన్ లో మరింత విధ్వంసం, నరమేధాన్ని సృష్టించడానికి రష్యాకు చైనా పలు రకాల డెడ్లీ వెపన్స్ ను అందిస్తోందని, ఈ విషయాన్ని తాము బలంగా నమ్ముతున్నామని అన్నారు.

అమెరికన్ మీడియా సంస్థ సీబీఎస్ కు ఇచ్చిన ఫేస్ ద నేషన్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారాయన. అవి ఎలాంటి ఆయుధాలనేవీ తమకు ఇంకా తెలియరాలేదని అన్నారు. దీని గురించి ఆరా తీసే ప్రయత్నాలు చేస్తోన్నామని విలియం బర్న్న్ చెప్పారు. ఉక్రెయిన్‌ పై రష్యా యుద్ధాన్ని ఆరంభించిన అనంతరం తాను కీవ్ కు వెళ్లాల్సి వచ్చిందని, అప్పుడే- రష్యా వినియోగించే ఆయుధాల గురించి తెలుసుకున్నానని గుర్తు చేశారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. బెలారస్ సరిహద్దు నుంచి ఉక్రెయిన్ పై మెరుపు దాడి చేసి.. కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రణాళికలను రూపొందించుకున్నట్లు తమ నిఘా వర్గాల ద్వారా తెలిసిందని చెప్పారు. ఇదే విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్‌స్కీకి చేరవేశామని, ఫలితంగా ఉక్రెయిన్ సైన్యం అప్రమత్తమైనట్లు చెప్పారు. అలాగే కీవ్ కు వాయవ్యంగా ఉన్న గోస్టోమెల్ విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకోవడానికి రష్యా సైన్యం ప్రయత్నించిందని, దీన్ని అడ్డుకోగలిగామని పేర్కొన్నారు.