World

హాలోవీన్ వేడుకల్లో అపశ్రుతి.. తొక్కిసలాటలో 149 మంది మృతి

హాలోవీన్ వేడుకల్లో అపశ్రుతి.. తొక్కిసలాటలో 149 మంది మృతి

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఘటన

జనం ఇరుకైన వీధిగుండా వెళ్తుండగా తొక్కిసలాట

150 మందికిపైగా గాయాలు

కొనసాగుతున్న సహాయక చర్యలు

వేడుకకు హాజరైన లక్ష మంది

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో నిర్వహించిన హాలోవీన్ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. అప్పటి వరకు ఉత్సాహంగా సాగిన సంబరాల్లో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది.

తొక్కిసలాట కారణంగా 149 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇటావాన్‌లో శనివారం రాత్రి ఈ వేడుకలు నిర్వహించగా జనం ఓ ఇరుకైన వీధి నుంచి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.

400 మంది అత్యవసర సిబ్బందిని, 140 వాహనాలను రంగంలోకి దించిన అధికారులు సహాయక కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులను, మృతదేహాలను ఆసుపత్రికి తరలిస్తున్నారు.

మృతదేహాల్లో ఇంకా కొన్ని వీధుల్లోనే ఉన్నాయని అధికారి ఒకరు తెలిపారు. సమీపంలోని ఓ బార్‌కు సినీతార ఒకరు వచ్చారన్న సమాచారంతో అక్కడికి వెళ్లేందుకు అందరూ ఒకేసారి ప్రయత్నించడంతో ఈ ఘటన జరిగినట్టు స్థానిక మీడియా పేర్కొంది.

దాదాపు లక్షలమంది ఈ వేడుకలకు హాజరయ్యారని, కరోనా ఆంక్షలు ఎత్తివేత తర్వాత ఇంతపెద్ద మొత్తంలో హాజరు కావడం ఇదే తొలిసారని తెలిపింది….