SPORTS

షంషి, షోయబ్‌ మాలిక్‌ మాయాజాలం​.. రిజ్వాన్‌ జట్టుకు ఊహించని షాక్‌

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2023 సీజన్‌లో మహ్మద్‌ రిజ్వాన్‌ సారథ్యంలోని ముల్తాన్‌ సుల్తాన్స్‌కు రెండో ఓటమి ఎదురైంది. ప్రస్తుత సీజన్‌లో తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన సుల్తాన్స్‌ ఆ తర్వాత వరుసగా 4 విజయాలు సాధించి, ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన 6వ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ప్రస్తుత సీజన్‌లో భీకర ఫామ్‌లో ఉన్న రిజ్వాన్‌.. ఈ మ్యాచ్‌లో విఫలం కావడంతో సుల్తాన్స్‌ ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో వరుసగా 75, 28 నాటౌట్‌, 66, 50, 110 నాటౌట్‌, 29 స్కోర్లు చేసిన రిజ్వాన్‌.. ఈ ఒక్క మ్యాచ్‌లోనే నిరుత్సాహపరిచాడు. మ్యాచ్‌ విషయానికొస్తే.. ముల్తాన్‌ సుల్తాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కరాచీ కింగ్స్‌ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన కింగ్స్‌.. మాథ్యూ వేడ్‌ (46), జేమ్స్‌ విన్స్‌ (27), తయ్యబ్‌ తాహిర్‌ (65) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా, ఛేదనలో సుల్తాన్స్‌ 101 పరుగులకే చాపచుట్టేయడంతో ఓటమిపాలైంది. సుల్తాన్స్‌ ఇన్నింగ్స్‌లో షాన్‌ మసూద్‌ (25), మహ్మద్‌ రిజ్వాన్‌ (29), అన్వర్‌ అలీ (12), ఉసామా అలీ (10) మినహా మిగతవారు కనీసం రెండంకెల స్కోర్‌ కూడా చేయలేకపోయారు. తబ్రేజ్‌ షంషి (3/18), షోయబ్‌ మాలిక్‌ (3/18), అకీఫ్‌ జావిద్‌ (2/8), ఇమాద్‌ వసీం (2/34) పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు సుల్తాన్స్‌ను కట్టడి చేయడంలోనూ సఫలమయ్యారు. అంతకుముందు ముల్తాన్స్‌ బౌలర్లు ఇహసానుల్లా 2 వికెట్లు, అన్వర్‌ అలీ ఓ వికెట్‌ పడగొట్టారు. పీఎస్‌ఎల్‌లో ఇవాళ రాత్రి లాహోర్‌ ఖలందర్స్‌-పెషావర్‌ జల్మీ తలపడనున్నాయి.