CINEMA

పవన్ కళ్యాణ్, సుధీర్ వర్మ సినిమా నుండి క్రేజీ అప్డేట్..

తొలి చిత్రం ‘స్వామి రారా’తో అందరి దృష్టిలో పడ్డాడు దర్శకుడు సుధీర్ వర్మ. ఆ తర్వాత పలు చిత్రాలను రూపొందించినా, ఆ స్థాయి విజయం మాత్రం అతనికి దక్కలేదు. ‘దోచేయ్, రణరంగం, శాకినీ డాకిని’ చిత్రాలు నిరాశ పర్చగా, ‘కేశవ’ మాత్రం ఫర్వాలేదనిపించింది. దాంతో అతని తాజా చిత్రం ‘రావణాసుర’ మీదనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. అభిషేక్ నామాతో పాటు రవితేజ కూడా ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించడం విశేషం. సుశాంత్ తో పాటు ఐదుగురు అందాల భామలు కీలక పాత్రలు పోషించిన ‘రావణాసుర’ ఈ నెల 7న జనం ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సుధీర్ వర్మ తన మనసులోని మాటలను మీడియాకు వెల్లడించారు.

 

కథ రివీల్ చేయకుండా మాట్లాడుతూ, “‘రావణాసుర’ సూపర్ ఎక్సయిటెడ్ గా వుంటుంది. సినిమాలో థ్రిల్స్, షాకింగ్ ఎలిమెంట్స్ ప్రధాన ఆకర్షణగా వుంటాయి. అందులో ఏది రివీల్ చేసినా సినిమా చూసినప్పుడు ఆ థ్రిల్ వుండదు. ప్రేక్షకుడికి థ్రిల్లింగ్ అనుభూతిని ఇవ్వడానికే దానిని హోల్డ్ చేస్తున్నాం. ఇక రవితేజ విషయానికి వస్తే… ఆయనతో సినిమా చేయాలన్నది ఎప్పటి నుండో ఉన్న ప్లాన్. అయితే ఫలానా జోనర్ సినిమా చేయాలని ముందుగా ఏమీ అనుకోలేదు. అయితే శ్రీకాంత్ విస్సా ఈ కథ చెప్పిన్నపుడు రవితేజ గారికి నచ్చి, నేనైతే బావుంటుదని నా దగ్గరికి పంపించారు. కథ విన్నప్పుడు నాకు ఎక్సయిటింగా అనిపించింది. ఇలాంటి థ్రిల్లర్ ని ఓ పెద్ద హీరో చేయడం ఇంకా ఎక్సయిటెడ్ గా అనిపించింది. ‘రావణాసుర’ వంద శాతం కొత్త జోనర్ మూవీ. ఇలాంటి కథ ఇప్పటివరకూ తెలుగులో రాలేదు. సినిమాపై చాలా నమ్మకంగా వున్నాం” అని అన్నారు.

 

ఇందులో హీరోని గ్రే షేడ్స్ లో చూపించడం గురించి చెబుతూ, “గ్రే షేడ్స్ అనేది చాలా కాలంగా వుంది. ‘అంతం’లో నాగార్జున, ‘సత్య’లో జేడీ ఇవన్నీ గ్రేనే! ఇవి ఎప్పటి నుంచో వున్నాయి. అయితే ఈ మధ్య అవి ఎక్కువగా పెరిగాయి. ఇక మణిరత్నం గారి ‘రావణ్‌’కు ఈ కథకు ఏం సంబంధం లేదు. మణిరత్నం గారు ఎగ్జాట్ గా రామాయణం తీశారు. అయితే ఇందులో నా హీరో పాత్రకి రావణాసుర పేరు సరిగ్గా నప్పుతుందని అలా పెట్టాం తప్పితే నేను రామాయణంలోకి వెళ్ళలేదు. అయితే రావణాసుర అనే పేరు పెట్టిన తర్వాత దానికి తగ్గట్టు కొన్ని డైలాగులు యాప్ట్ అయ్యాయి, కొన్ని వాడుకున్నాం తప్ప రామాయణంతో సంబంధం లేదు” అని వివరణ ఇచ్చారు. ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో మాత్రమే విడుదల చేస్తున్నట్టు సుధీర్ వర్మ క్లారిటీ ఇచ్చారు. ఆ విషయం చెబుతూ, “హిందీ, తమిళ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయాలని ముందు అనుకున్నాం. కానీ అదర్ లాంగ్వేజ్ వాళ్ళకి పదిహేను రోజులు ముందు కాపీ పంపించాలి. అయితే మేము ఏదైతే దాస్తూ వచ్చామో ఆ ఎలిమెంట్స్ బయటికి వచ్చేస్తాయనే భయంతో ముందు తెలుగులోనే విడుదల చేస్తున్నాం. సెకండ్ వీక్ నుంచి హిందీలో ప్లాన్ చేస్తున్నాం” అని తెలిపారు. పవన్ కళ్యాణ్ తోనూ సుధీర్ వర్మ మూవీ చేయబోతున్నారనే వార్త కొంతకాలంగా వినిపిస్తోంది. దాని గురించి చెబుతూ, “అది త్రివిక్రమ్ గారి కథతో వుంటుంది. అయితే ఎప్పుడు ఏంటి అనేది త్వరలో తెలుస్తుంది” అని బదులిచ్చారు.