పుష్ప పార్ట్ 1 ది రైజ్ ఏ ముహూర్తాన ఉత్తరాదిలో బ్లాక్ బస్టర్ అయ్యిందో కానీ అప్పటి నుంచి అందరికీ ప్యాన్ ఇండియా ఫీవర్ పట్టేసింది. అంతకు ముందు బాహుబలితోనే ఇది జరిగినప్పటికీ కమర్షియల్ మూవీతోనూ నార్త్ ఆడియన్స్ ని మెప్పించవచ్చని నిరూపించింది బన్నీనే.
ఆ తర్వాత కెజిఎఫ్ 2 దీనికి ఊతమిచ్చింది. అక్కడితో మొదలు చిన్నా పెద్ద తేడా లేకుండా అందరికీ ఈ జ్వరం పట్టుకుంది. పట్టుమని పది కోట్ల మార్కెట్ లేని చిన్న హీరోలు సైతం తమ సినిమాలను అన్ని భాషల్లో డబ్ చేయాల్సిందేనని పట్టు బడుతున్నారు.
తమవి ఇతర రాష్ట్రాల్లో ఆడవని తెలిసినా కూడా నిర్మాత మీద అదనపు భారం మోపుతున్నారు. దీని వల్ల కనీసం ముంబైకి వెళ్లొచ్చిన ఫ్లైట్ టికెట్లు సైతం గిట్టుబాటు కానంత దారుణంగా ఫ్లాపవుతున్నాయి. విజువల్ గ్రాండియర్ గా గుణశేఖర్ దిల్ రాజులు తెగ ప్రమోట్ చేసుకున్న శాకుంతలంకు ఏమయ్యిందో వసూళ్ల సాక్షిగా చూస్తున్నాం. ఆల్ టైం డిజాస్టర్ కన్నా మంచి పదం ఏదైనా ఉందేమోనని ట్రేడ్ విశ్లేషకులు వెతుకుతున్నారు. పెట్టిన బడ్జెట్ లో కనీసం పది వంతు మొదటి వీకెండ్ లో రాకపోతే అంతకన్నా అవమానం ఏముంది.
గత ఏడాది లైగర్ ది ఇదే కథ. ఆగ్ లాగా దేంగే అంటూ విజయ్ దేవరకొండ వెళ్లిన ప్రతిచోటా కేకలు పెట్టాడు. ఏమైంది. పూరి జగన్నాథ్ కి చేతిలో ఉన్న సినిమా ఊడిపోయి ఎవరు డేట్లు ఇస్తారాని ఎదురు చూడాల్సి వచ్చింది. గాడ్ ఫాదర్, ఆచార్యలను కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. అఖండ ఇక్కడ రికార్డులు సృష్టించినా ఏడాది ఆలస్యంగా డబ్ చేయడం వల్ల రెవిన్యూ రాలేదు. రవితేజ ఖిలాడీకీ అవమానాలు తప్పలేదు. రాధే శ్యామ్ మీదా కనికరం చూపించలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని ఉదాహరణలు ఉన్నాయి.
ఇకనైనా హీరో దర్శకనిర్మాతలు ప్రాక్టికల్ గా ఆలోచించాలి. ఊరికే ప్యాన్ ఇండియా జపంలో పడి స్క్రిప్ట్ లను నిర్లక్ష్యం చేయడం వల్ల భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. దీని వల్ల ఢిల్లీ ముంబై బ్యాచ్ కు చులకన కావడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. అసలే ఆర్ఆర్ఆర్ ఆస్కార్ గెలిచినందుకు దుగ్ధతో రగిలిపోతున్నారు. ఇప్పుడు సౌత్ సినిమాలు ఏ మాత్రం నాసిరకంగా ఉన్నా కలెక్షన్లు దారుణంగా వచ్చినా ట్రోలింగ్ చేసి మరీ ఆనందం పొందుతున్నారు. వీటికి చెక్ పెట్టాలంటే అసలు ఏవి మల్టీ లాంగ్వేజ్ చేయాలి వేటికి అర్హత లేదో ముందే గుర్తించాలి. లేదంటే రాజమౌళి సృష్టించిన అతి పెద్ద మార్కెట్ కి క్రమంగా బీటలు వారతాయి. జాగ్రత్తగా ఉండాల్సిందే.