స్వప్న సినిమా నిర్మాణంలో నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘అన్నీ మంచి శకునములే’.
మిత్ర విందా మూవీస్ తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యంలో ఇందులో కీలక పాత్ర పోషించిన నటి వాసుకి మూవీ విశేషాలను విలేకరులతో పంచుకున్నారు. వాసుకి నటించిన తొలి తెలుగు సినిమా ‘తొలిప్రేమ’ విడుదలై 23 సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత పలు అవకాశాలు వచ్చినా ఆమె అంగీకరించలేదు. ఆ సినిమా తర్వాత ప్రముఖ కళాదర్శకుడు ఆనంద్ సాయిని ఆమె వివాహం చేసుకుంది. మళ్ళీ ఇంతకాలానికి కెమెరా ముందుకు వచ్చింది. ఆ విశేషాలు తొలుత చెబుతూ, “‘తొలిప్రేమ’ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. నాకు నచ్చిన అవకాశాలు కూడా వచ్చాయి. కానీ చేయడం నాకు కుదరలేదు. ఎందుకంటే నేను మల్టీ టాస్కర్ కాదు. అన్ని పనులు ఒకేసారి చేయలేను. ముందు పిల్లలు, వాళ్ళ చదువులు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు యూకేలో చదువుతున్నారు. పాప మెడిసిన్ (ఫోర్త్ ఇయర్), బాబు సెకండ్ ఇయర్ ఆర్కిటెక్చెర్. ఆనంద్ సాయి ఆయన పనిలో బిజీగా వుంటారు. ఇప్పుడు ఏదైనా చేయడానికి నాకు సమయం కుదిరింది. ఇలాంటి సమయంలో నందిని రెడ్డి ఈ కథతో వచ్చారు. నాకు నచ్చింది. సినిమాతో పాటు చదువుపై కూడా దృష్టి పెట్టాను. సైకాలజీలో పీహెచ్డీ చేస్తున్నాను” అని తెలిపింది.