ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు కీలకం. ఒకరకంగా జీవన్మరణ సమస్యే. అందుకే చంద్రబాబు చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఏ చిన్న అవకాశాన్ని జారవిడుచుకోవడం లేదు. ప్రత్యర్థులకు అస్సలు చాన్సివ్వదలచుకోలేదు. అయితే చంద్రబాబు ప్రయత్నాలు కొంతవరకూ సఫలీకృతమవుతున్నాయి. ఇటీవల సత్ఫలితాలనిస్తున్నాయి. మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం, తరువాత జనసేనతో పొత్తు కుదిరిన సంకేతాలు, బీజేపీ మెత్తబడడం వంటివి కలిసి వస్తున్నాయి. అధికారికంగా పొత్తుల ప్రకటనకు సిద్ధపడుతున్నారు. పనిలో పనిగా నందమూరి కుటుంబసభ్యులను సైతం తనదారిలో తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీకి మే నెల కీలకం. ఇదే నెలలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలతో పాటు మహానాడు నిర్వహిస్తున్నారు. పొత్తులపై కీలక ప్రకటనలు చేయడంతో పాటు పార్టీలో చేరికలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. గత ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వెళ్లిన చాలా మంది నేతలు తిరిగి ముఖం పట్టనున్నారు. వారందరూ ఎప్పుడు నుంచో టచ్ లోకి రాగా.. మహానాడు నుంచి పార్టీలో చేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. నందమూరి కుటుంబం మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నారు. గతం కంటే భిన్నంగా నందమూరి కుటుంబం రాజకీయంగా ఈ సారి యాక్టివ్ గా కనిపిస్తోంది. చంద్రబాబుకు మద్దతుగా పలు సందర్భాల్లో బయటకు వచ్చారు. చంద్రబాబు తాజాగా గుడివాడలో పర్యటన సమయంలో నందమూరి రామకృష్ణ కూడా పాల్గొన్నారు. చంద్రబాబు వ్యూహాత్మకంగానే రోడ్ షో లో నందమూరి రామక్రిష్ణను ముందుంచారు.
ఈ నెల 20న హైదరాబాద్ లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహించనున్నారు. దాదాపు నందమూరి వంశానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఆహ్వాన కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ ఆహ్వాన పత్రికలు అందించారు. కుటుంబసభ్యులందరికీ వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించారు. కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరికి సైతం ఆహ్వానం అందించారు. అటు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణరామ్ సోదరులకు ఇన్విటేషన్ ఇచ్చారు. శకపురుషుడు, సావనీర్, జయహో ఎన్టీఆర్ వెబ్ సైట్ ను ఆవిష్కరించనున్నారు. కొద్దిరోజుల కిందట విజయవాడలో సైతం వేడుకలు నిర్వహించారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ ను పిలవకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఈసారి అటువంటి విమర్శలు రాకుండా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎన్టీఆర్ కు ప్రత్యేక ఆహ్వానం పంపించారు.