APCINEMA

పవన్ ఒకప్పుడు బాగుండేవాడు- ఇప్పుడే ఇలా: జాలి చూపించిన పోసాని

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహిస్తోన్న వారాహి పర్యటన కలకలం రేపుతోంది. ఈ పర్యటన సందర్భంగా ఆయన చేస్తోన్న విమర్శలు, ఆరోపణలు రాజకీయ దుమారాన్ని రేపుతోన్నాయి.

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఎదురుదాడికి కారణమౌతోన్నాయి. పవన్ చేస్తోన్న విమర్శలను వైఎస్ఆర్సీపీ నాయకులు తిప్పికొడుతున్నారు. పార్ట్ టైమ్ పొలిటీషియన్ రాజకీయాలు ఏపీకి అవసరం లేదని తేల్చేస్తోన్నారు.

పవన్ కల్యాణ్ విమర్శలపై తాజాగా ప్రముఖ నటుడు, ఏపీ ఫిల్మ్, టీవీ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి స్పందించారు. పవన్‌ను తాను సినిమా ఆర్టిస్ట్‌గానే చూస్తోన్నానని వ్యాఖ్యానించారు. సినిమా ఆర్టిస్ట్‌ను చూడటానికి ప్రజలు ఆయన సభలకు వెళ్తోన్నారని, అంతకంటే ఇంకేమీ లేదని అన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వానికి అండగా నిలిచిన తన సొంత కాపు సామాజిక వర్గాన్ని పవన్ కల్యాణ్ ఎందుకు విమర్శిస్తోన్నారో అర్థం కావట్లేదని చెప్పారు.

తన సొంత సామాజిక వర్గాన్ని బెదిరించడం, వారిని విమర్శించడం పవన్ కల్యాణ్‌కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. తన కులాన్ని తానే తిడుతున్నాడని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం.. ఆయన వేసిన స్కెచ్‌కు అనుగుణంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్నాడని ఆరోపించారు.

కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కంటే పవన్ కల్యాణ్ గొప్పవాడా? అంటూ నిలదీశారు. ఎవరైనా రాజకీయ పార్టీని పెడితే- తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారని, పవన్ మాత్రం దీనికి భిన్నంగా చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి పరితపిస్తోన్నాడని ఎద్దేవా చేశారు పోసాని.

ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు కూడా గతంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ఇలాంటి ప్రకటనలు చేయలేదని గుర్తు చేశారు. తాను పార్టీని పెట్టింది వైఎస్సార్‌ను ఓడించడానికి కాదు, నేను గెలవడానికేనంటూ చెప్పారని పేర్కొన్నారు. పవన్‌ కల్యాణ్‌ గురించి చాలా గొప్పగా ఊహించుకున్నానని, ఆయన రాజకీయాలు చూశాక గౌరవం పోయిందని తేల్చి చెప్పారు. పవన్‌ ఒకప్పుడు మంచోడేనని, ఇప్పుడిలా పిచ్చివాడిలా ఎందుకు తయారయ్యాడో తెలియట్లేదని అన్నారు.