బేబీ సినిమాలో హీరోయిన్ గా నటించి ఓవర్ నైట్ లో స్టార్డం తెచ్చుకుంది వైష్ణవి చైతన్య.
గతంలో యూట్యూబర్ గా అనేక వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ లో కనిపించిన ఆమె సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ సినిమాలో ఇప్పటి తరం అమ్మాయిగా కనిపించి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమా బాగుందని మెచ్చుకున్న వాళ్ళు బాలేదని, విమర్శించిన వారు సైతం సినిమాలో వైష్ణవి చైతన్య నటన మాత్రం మెచ్చుకుంటున్నారు. అయితే ఇలాంటి ఒక బోల్డ్ తరహా పాత్రలో నటించిన తర్వాత ఆమెకు అవకాశాలు రావేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఈ దెబ్బకి ఆమెకు వరుస అవకాశాలు లభిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పూరి జగన్నాథ్ రామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఆమెకు అవకాశం వచ్చిందని ప్రచారం జరుగుతున్నా ఆ విషయం మీద క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు మరో కొత్త ప్రచారం తెరమీదకు వచ్చింది.
అదేమంటే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఒక సినిమా ఈ మధ్యనే లాంచ్ అయింది. ఆ సినిమాలో బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్యను హీరోయిన్ గా తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి బేబీ సినిమా ప్రకటించినప్పటి నుంచి రిలీజ్ చేసే వరకు చిన్న సినిమాగానే అందరికీ తెలుసు. కానీ రిలీజ్ అయిన తర్వాత ఆమెకు మంచి పేరు అయితే వచ్చింది, ఇప్పుడు యూత్ లో మంచి పాపులారిటీ ఉన్న సిద్దు జొన్నలగడ్డ తో కలిసి సినిమా చేస్తుండడం దానికి లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ గా ముద్ర వేసుకున్న బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ చేయడం చూస్తుంటే ఆమె పరిస్థితి తంతే బూరెల బుట్టలో పడినట్టుగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి.