CINEMA

అమరావతి అసైన్డ్ భూముల కేసులో కొత్త ట్విస్ట్.. సీఐడీకి సరికొత్త ఆధారాలు..!

గత ప్రభుత్వ హయాంలో జరిగిన స్కామ్‌లను వరుసగా వెలికి తీస్తున్నామని అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు చెబుతున్నారు..

మరోవైపు.. కక్ష సాధింపులో భాగంగానే అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ, కేసుల పరంపర మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించడంలేదు. అమరావతి అసైన్డ్ భూముల కేసులో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. ఈ కేసులో సీఐడీకి సరికొత్త ఆధారాలు చిక్కాయి.. అమరావతి అసైన్డ్ భూముల కేసును మళ్లీ ఓపెన్ చేస్తూ హై కోర్టులో ఆంధ్రప్రదేశ్ సీఐడీ రెండు పిటిషన్లు ఫైల్ చేసింది.. ఈ మేరకు సీఐడీకి మాజీ మంత్రి నారాయణ మరదలు పొంగూరు కృష్ణప్రియ ఆడియో, వీడియో ఆధారాలు అందజేశారు. ఇందులో నారాయణ, తదితరులు ఏ విధంగా అక్రమంగా భూములు కొనుగోలు చేసింది.. ఎసైన్డ్ భూములున్న దళితులు, ఇతర బలహీనవర్గాలవారిని అధికార దర్పంతో బలంతో ఏ విధంగా బెదిరించారు.. ఏ విధంగా వాటిని కాజేశారు అనే విషయాలను కృష్ణప్రియ వివరించినట్టుగా తెలుస్తోంది.

 

ఈ నేపథ్యంలో కేసును రీ-ఓపెన్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేశారు సీఐడీ అధికారులు.. వాస్తవానికి ఆ భూముల విషయంలో తాము ఎలాంటి అక్రమాలకూ పాల్పడలేదని పేర్కొంటూ ఈ కేసును కొట్టేయాలని గతంలోనే కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో విచారణ ముగియగా తీర్పును హైకోర్టు ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది. అయితే, ఎల్లుండి సోమవారం తీర్పు రానున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ కేసును రీ ఓపెన్ చేయాలంటూ సీఐడీ పిటిషన్ వేయడం టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి నారాయణకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది.

 

కాగా, రాజధానిలో అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం జరిగింది అంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు 2021 మార్చి 12వ తేదీన కేసు నమోదు చేశారు.. ఈ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి పొంగూరు నారాయణల మీద అభియోగాలు నమోదయ్యాయి. అయితే, ఈ కేసు విచారణ జరగకుండా 2021 మార్చి 19న హై కోర్టు స్టే విధించింది.. మరోవైపు.. ఈ కేసును కొట్టేయాలంటూ నారాయణ సైతం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.. ఆ పిటిషన్ మీద విచారణ పూర్తవగా అక్టోబర్ 16 తేదీకి తీర్పు వాయిదా వేసింది న్యాయస్థానం.. ఈ క్రమంలోనే కేసును రీ ఓపెన్ చేయాలని సీఐడీ పిటిషన్ వేయడంతో చర్చగా మారింది.