దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘నేను శైలజ’ ద్వారా కీర్తి సురేష్ టాలీవుడ్‌కు పరిచయమైన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో శైలజ పాత్ర కోసం కీర్తిని ఎంపిక చేయడం వెనుక ఒక పెద్ద డ్రామా జరిగిందని దర్శకుడు ఇటీవల వెల్లడించారు. కథ రాసుకున్నప్పుడే ‘శైలజ’ అనే ఇంట్రోవర్ట్ పాత్రకు కీర్తి సురేష్ అయితేనే సరైన న్యాయం చేస్తుందని ఆయన బలంగా నమ్మారు. కానీ అప్పట్లో ఆమె కొత్త కావడంతో, నిర్మాతలు ఒక వెలుగు వెలుగుతున్న స్టార్ హీరోయిన్ను తీసుకోవాలని ఒత్తిడి చేశారట.
నిర్మాతల మాట కాదనలేక ఆ స్టార్ హీరోయిన్‌కు కథ చెప్పడానికి వెళ్లిన కిషోర్ తిరుమల, అక్కడే ఒక తెలివైన ఎత్తుగడ వేశారు. ఆ హీరోయిన్ ఎలాగైనా ఈ సినిమాను రిజెక్ట్ చేయాలనే ఉద్దేశంతో, కావాలనే కథను ఆసక్తికరంగా చెప్పకుండా చాలా మామూలుగా వివరించారు. ఆయన ఊహించినట్టుగానే ఆ స్టార్ హీరోయిన్‌కు కథ నచ్చలేదు. దీంతో ఆమె సినిమా చేయలేనని చెప్పగానే, కిషోర్ తిరుమల ఎంతో సంతోషపడి లోపల “థాంక్యూ” చెప్పుకుని అక్కడి నుంచి వచ్చేసారట. ఆ స్టార్ హీరోయిన్‌కు ఉన్న ఇమేజ్ వల్ల తన సినిమాలో ‘శైలజ’ పాత్ర తేలిపోతుందని ఆయన భావించడమే దీనికి ప్రధాన కారణం.
చివరికి తన మొండి పట్టుదలతో కీర్తి సురేష్‌నే హీరోయిన్గా పెట్టి సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రేక్షకులు కూడా కీర్తిని ఒక హీరోయిన్ లా కాకుండా నిజంగా ‘శైలు’ పాత్రగానే ఓన్ చేసుకున్నారు. దర్శకుడి నమ్మకాన్ని నిలబెడుతూ కీర్తి సురేష్ తన నటనతో ఆ పాత్రకు ప్రాణం పోసింది. ఈ రిస్క్ ఫలించడంతోనే కీర్తి సురేష్ ఈరోజు సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్గా ఎదిగింది. కిషోర్ తిరుమల చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

