యాక్షన్ కింగ్ అర్జున్ తన కుమార్తె ఐశ్వర్య అర్జున్ను తెలుగు తెరకు పరిచయం చేస్తూ రూపొందించిన ‘సీతా పయనం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. సీనియర్ హీరోల వారసులు కథానాయికలుగా రాణిస్తున్న తరుణంలో, ఐశ్వర్య కూడా టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేస్తుందని భావించినప్పటికీ, ఈ సినిమా ఫలితం ఆమెకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. స్వయంగా అర్జున్ ఈ చిత్రానికి నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరించి భారీ రిస్క్ తీసుకోవడం గమనార్హం.
నిజానికి ఐశ్వర్య కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి చాలా కాలమైనప్పటికీ, తెలుగులోకి రావడంలో చేసిన ఆలస్యం సినిమాపై ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. తన కూతురు సినిమాను ప్రేక్షకుల చెంతకు చేర్చడానికి అర్జున్ టాలీవుడ్‌లో విస్తృతంగా పర్యటించి, ప్రమోషన్ల కోసం ఎంతో శ్రమించారు. అయితే, ఆ ప్రచార వేడి థియేటర్ల వద్ద వసూళ్లుగా మారలేకపోయింది. కథలో అనవసరమైన సాగతీత ఉండటం, కథానాయికతో పాటు హీరో కూడా ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోవడం ఈ సినిమాకు ప్రధాన మైనస్‌లుగా మారాయి.
సినిమా విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. అర్జున్ కేవలం నిర్మాతగా ఉండి, దర్శకత్వ బాధ్యతలు మరొకరికి అప్పగించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక పరంగా అర్జున్ ఈ విషయంలో తన బాధ్యతను నెరవేర్చినప్పటికీ, సృజనాత్మక పరంగా కథలో లోపాలు సినిమాను దెబ్బతీశాయి. మొత్తానికి టాలీవుడ్ ఎంట్రీలో సక్సెస్ అందుకోవాలనుకున్న ఐశ్వర్య అర్జున్ ఆశలపై ‘సీతా పయనం’ నీళ్లు చల్లింది.

