మనం మెంతికూరను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మెంతికూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు తగ్గడంలో కూడా మెంతికూర మనకు దోహదపడుతుంది. మెంతికూరతో మనం పప్పు, పరోటా, కూర వంటి వాటిని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాము. వీటితో పాటు మెంతికూరతో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. 15 నుండి 20 నిమిషాల్లో చాలా సులభంగా, చాలా త్వరగా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఎంతో కమ్మగా ఉండే మెంతికూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతికూర పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టీ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, ధనియాలు – ఒకటిన్నర టీ స్పూన్, ఎండుమిర్చి – 4, పచ్చిమిర్చి – 10 నుండి 15, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, మెంతికూర – ఒక కట్ట( మధ్యస్థంగా ఉన్నది), టమాటాలు – 4 లేదా 5, చింతపండు – చిన్న నిమ్మకాయంత, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 4.
Menthikura Pachadiమెంతికూర పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర, ధనియాలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత నువ్వులు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత మెంతికూర వేసి వేయించాలి. మెంతికూర పూర్తిగా వేగి దగ్గరపడిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి. తరువాత అదే కళాయిలో మరికొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తరువాత టమాట ముక్కలు, చింతపండు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత మూత తీసి పసుపు వేసి కలపాలి. తరువాత నీరంతా పోయే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
టమాట ముక్కలు పూర్తిగా చల్లారిన తరువాత ఒక జార్ ను తీసుకుని అందులో ముందుగా వేయించిన మెంతికూర, పచ్చిమిర్చి, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఉడికించిన టమాటాలు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ పచ్చడిని ఎండుమిర్చి, కరివేపాకు, తాళింపు దినుసులు, ఇంగువతో తాళింపు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మెంతికూర పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మెంతికూరతో పచ్చడిని తయారు చేసుకుని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.