Health

వాక్కాయ పచ్చడిని ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేయాలి

వాక్కాయలు.. మనకు ఇవి వర్షాకాలంలో ఎక్కువగా లభిస్తాయి. వాక్కాయలు పుల్లగా, వగరుగా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగాత ఇంటారు.

వాక్కాయలను తినడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలు లభించడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వాక్కాయలను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అలాగే ఈ కాయలను తీసుకోవడం వల్ల ఒత్తిడి, అలసట, తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.

కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇలా అనేక రకాలుగా వాక్కాయలు మనకు దోహదపడతాయి. వాక్కాయలను నేరుగా తినడంతో పాటు వీటితో పచ్చడి, కూర, పప్పు వంటి వాటిని కూడా తయారు చేస్తారు. వాక్కాయలతో చేసే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. రుచిగా, ఎంతో కమ్మగా ఉండే వాక్కాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Vakkaya Pachadi
వాక్కాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..

వాక్కాయలు – పావుకిలో, వెల్లుల్లి రెబ్బలు – 8, కారం – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత లేదా 2 టేబుల్ స్పూన్ల కంటే కొద్దిగా తక్కువ, జీలకర్ర – ఒక టీ స్పూన్, మెంతిపిండి – అర టీ స్పూన్, నూనె – అర కప్పు, ఇంగువ – పావు టీ స్పూన్.

వాక్కాయ పచ్చడి తయారీ విధానం..

ముందుగా వాక్కాయలను నిలువుగా నాలుగు భాగాలుగా కట్ చేసుకుని లోపల ఉండే గింజలను తీసి వేయాలి. తరువాత ఒక జార్ లో వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం, జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కట్ చేసిన వాక్కాయ ముక్కలను తీసుకోవాలి. తరువాత అందులో మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం, మెంతిపిండి వేసి కలపాలి. తరువాత పావు కప్పు పచ్చి నూనె వేసి కలపాలి. తరువాత కళాయిలో మిగిలిన పావు కప్పు నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఇంగువ వేసి ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసి వాక్కాయ ముక్కలపై వేసుకోవాలి. తరువాత అంతా కలిసేలా కలుపుకుని ఈ ముక్కలను గాజు సీసాలో వేసి గాలి తగలకుండా మూత పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల వాక్కాయ పచ్చడి తయారవుతుంది. దీనిని రెండు రోజుల తరువాత అన్నంతో సర్వ్ చేసుకోవాలి. ఈ పచ్చడి పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.