Health

రాగి పాయసం ఆరోగ్యానికి మేలు

రాగులు.. ఇవి మనందరికి తెలిసినవే. అలాగే వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందన్న విషయం కూడా మనకు తెలుసు. రాగులు అనగానే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేవి రాగి జావ, రాగి సంగటే. ఇవే కాకుండా రాగులతో మనం చక్కటి రుచిని కలిగి ఉండే రాగి పాయసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. రాగి పాయసం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం.

ఆరోగ్యానికి మేలు చేసే రాగి పాయసాన్ని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రాగి పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు.. రాగులు – పావు కప్పు, నీళ్లు – 6 కప్పులు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన ఎండుకొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు పలుకులు – 2 టేబుల్ స్పూన్స్, ఎండుద్రాక్ష – 2 టేబుల్ స్పూన్స్, సగ్గుబియ్యం – పావు కప్పు, బెల్లం తురుము – 1/3 కప్పు, పంచదార – పావు కప్పు లేదా తగినంత, యాలకుల పొడి – పావు టీ స్పూన్.

రాగి పాయసం తయారీ విధానం.. ముందుగా ఒక గిన్నెలో రాగులను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి ఒక రాత్రంతా నానబెట్టాలి. తరువాత ఈ రాగులను ఒక జార్ లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమంలో 2 కప్పుల నీళ్లు పోసి వడకట్టాలి. ఇలా చేయడం వల్ల రాగి పాలు తయారవుతాయి. తరువాత ఒక కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక ఎండుకొబ్బరి ముక్కలను వేసి వేయించాలి. తరువాత జీడిపప్పును, ఎండుద్రాక్షను వేసి వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో రెండు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత సగ్గుబియ్యాన్ని వేసి 5 నుండి 10 నిమిషాల వరకు ఉడికించాలి.

తరువాత బెల్లం తురుమును వేసి బెల్లం కరిగి పొంగు వచ్చే వరకు మరిగించాలి. తరువాత ముందుగా తయారు చేసుకున్న రాగి పాలతో పాటు మరో రెండు కప్పుల నీటిని పోసి ఉడికించాలి. తరువాత పంచదార కూడా వేసి పంచదార కరిగే వరకు కలుపుతూ ఉండాలి. పంచదార కరిగి పాయసం దగ్గర పడే వరకు ఉడికించాలి. పాయసం కొద్దిగా దగ్గరపడిన తరువాత అందులో యాలకుల పొడి, వేయించిన డ్రైఫ్రూట్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కమ్మటి రుచిని కలిగి ఉండే రాగి పాయసం తయారవుతుంది. ఈ పాయసాన్ని వేడిగా తింటేనే రుచిగా ఉంటుంది. దీనిలో పంచదారకు బదులుగా పూర్తిగా బెల్లాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఈ విధంగా రాగులతో పాయసాన్ని చేసి తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. రాగిజావ తాగని పిల్లలకు ఇలా రాగులతో పాయసం చేసి ఇవ్వడం వల్ల రాగుల్లో ఉండే పోషకాలు లభిస్తాయి.