Health

మిగిలిపోయిన ఇడ్లీలను పడేయకుండా వాటితో ఇలా ఫ్రై చేయండి..

మనం అల్పాహారంగా తీసుకునే ఇడ్లీలతో కూడా మనం వివిధ రకాల స్నాక్స్ ను తయారు చేస్తూ ఉంటాము. ఇడ్లీలతో చేసుకోదగిన రుచికరమైన స్నాక్ ఐటమ్స్ లో ఇడ్లీ ఫ్రైస్ కూడా ఒకటి.

ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ కంటే కూడా చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఈ ఫ్రైస్ చాలా చక్కగా ఉంటాయి. ఇడ్లీలు ఎక్కువగా మిగిలినప్పుడు ఇలా చక్కగా ఫ్రైస్ ను తయారు చేసుకుని తినవచ్చు. రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ ఇడ్లీ ఫ్రైస్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇడ్లీ ఫ్రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..

ఇడ్లీలు – 6, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, ఎండుమిర్చి – 7, పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, మినపప్పు -ఒక టేబుల్ స్పూన్, బియ్యం – ఒక టేబుల్ స్పూన్, మిరియాలు – అర టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి – ఒక టేబుల్ స్పూన్, ఆమ్ చూర్ పొడి – అర స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, కరివేపాకు – రెండు రెమ్మలు, ఉప్పు – తగినంత.

 

ముందుగా కళాయిలో ఎండుమిర్చి, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, బియ్యం,మిరియాలు వేసి వేయించాలి. తరువాత ఎండుకొబ్బరి పొడి, ఆమ్ చూర్, ఇంగువ, కరివేపాకు వేసి చిన్న మంటపై దోరగా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తరువాత జార్ లో వేసుకోవాలి. ఇందులోనే తగినంత ఉప్పు వేసి పొడిగా చేసుకోవాలి. తరువాత ఇడ్లీలను నిలువుగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని కట్ చేసిన తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఇడ్లీ ముక్కలను వేసి వేయించాలి.

వీటిని మధ్యస్థ మంటపై గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించి గిన్నె లోకి తీసుకోవాలి. తరువాత వీటిపై ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిని 2 టేబుల్ స్పూన్స్ మోతాదులో చల్లుకుని అంతా కలిసేలా టాస్ చేసుకోవాలి. వీటిని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఇడ్లీ ఫ్రైస్ తయారవుతాయి. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇడ్లీలను తినని వారు కూడా ఈ ఫ్రైస్ ను ఇష్టంగా తింటారు.