Health

చామదుంప కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు

కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అది మన అందరికి తెలిసిన విషయమే. అలాగే రూట్ కూరగాయలు కూడా ఆరోగ్యానికి శ్రేయస్కరం అందులో చామ దుంప ఒకటి. సాధారణంగా మనం చామ దుంపతో కూర మరియు ఫ్రై చేస్తాము. అయితే చాలా మంది దుంపలు అనగానే దానిలో పిండి పదార్థాలు ఎక్కువగా వుంటాయి అని వాటిని పక్కన పెడుతుంటారు. మరి కొందరు చామదుంప జిగురుగా వుంటాయని వాటిని పట్టించుకోరు. కాని చామ దుంపల వల్ల చాల ఉపయోగాలు ఉన్నాయి.

అయితే, ఇతర దుంపలతో పోలిస్తే చామదుంపల్లోనూ మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. చామ దుంపలో పిండి, పీచు పదార్థాలు ఎక్కువ. చామగడ్డలో విటమిన్- ఎ, బి1, బి2, బి3, బి5, బి6, బి9, సి లతోపాటు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, మాంగనీస్ వంటి పోషకాలతోపాటు పీచు ఎక్కువగా లభిస్తుంది. వీటిలో న్యూట్రీషియన్స్ సమృద్ధిగా ఉంటాయి. చామ దుంపలలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇది మధుమేహాన్ని నియంత్రిస్తుంది.

డయాబెటిస్ పేషెంట్లు చామ దుంపలని తీసుకోవడం వల్ల డైటరీ ఫైబర్ డైజేషన్ ప్రాసెస్‏ని మెరుగు చేస్తుంది. దీని మూలంగా శరీరంలో ఇన్సులిన్ విడుదలను రెగ్యులేట్ చేయగలుగుతుంది. అలాగే రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‏ను కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. ఇందులో ఐరన్ కూడా లభిస్తుంది. రక్తం పెరుగుదలకు ఇది ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా ఎనిమియా సమస్యతో బాధ పడే వాళ్ళకి చామదుంప బాగా సహాయం చేస్తుంది. పైగా బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇది బాగా మెరుగుపరుస్తుంది.

చామ దుంపలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియలో సమస్యలను నివారిస్తుంది. ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది. చామ దుంపను తినడం వలన గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పొటాషియం అధికంగా లభిస్తుంది. దీనితో సెల్ ఫంక్షన్స్ నార్మల్ గా ఉంచడానికి ఇది సహాయపడుతుంది. క్యాన్సర్ నిరోధానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. క్యాన్సర్ తో ఇబ్బంది పడేవాళ్ళు లేదా క్యాన్సర్ రిస్క్ ఉన్న వాళ్ళు చామ దుంపను తీసుకోవడం వల్ల ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ బాగా సహాయం చేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి కంటి ఆరోగ్యాన్ని మెరుగు పర్చడానికి కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది.