ప్రైవేట్ ఉద్యోగం చేసే వాళ్లకు ఎవరికైనా జీతం ఎప్పుడు పెరుగుతుందా అనే ఎదురుచూపు ఉంటుంది. ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగులను కాపాడుకోవడానికి ప్రతి ఏడాది ఉద్యోగుల జీతాలను పెంచుకుంటే పోతుంటాయి.అయితే 2023లో ప్రైవేట్ ఉద్యోగుల జీతాలు 9.8శాతం మేర పెరగుతాయనే వార్త ఉద్యోగుల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. కోర్న్ ఫెర్రీ సర్వేలో ఇలాంటి ఆసక్తికర విషయాలు ఉండగా.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త ఏడాదిలో కంపెనీలు ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచడానికి ముందుకు రానున్నట్లు కోర్న్ ఫెర్రీ సర్వేలో తేల్చింది. 2023లో ఉద్యోగుల జీతాలు 9.8శాతం పెరగనున్నట్లు ఇందులో తేలింది. 2022లో ఉద్యోగుల జీతం 9.4శాతం పెరగగా.. 2023తో పోలిస్తే అది తక్కువ.
ఇక నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను కాపాడుకోవడానికి కంపెనీలు ప్రోత్సాహకాలను ఇవ్వడానికి ముందుకు వస్తాయని కూడా ఆ సర్వేలో తేలింది. మొత్తం 818 కంపెనీల డేటా ఆధారంగా కోర్న్ ఫెర్రీ నిర్వహించిన ‘కాంపెన్సేషన్ సర్వే’లో ఈ వివరాలు తేలతెల్లమయ్యాయి. ఉత్తమ మరియు కీలక ఉద్యోగులను కాపాడుకోవడానికి కంపెనీలు రకరకాల ప్రయత్నాలు చేస్తాయని, అందులో భాగంగా భారీగా ప్రోత్సాహకాలతో పాటు వారి జీతాలను 15శాతం నుండి 30శాతం వరకు పెంచుతాయని కూడా కోర్న్ ఫెర్రీ సర్వే తేల్చింది. మరోపక్క ప్రపంచం అంతా మాంద్యం అంచుల్లో ఉంటే భారత్ మాత్రం దానికి భిన్నంగా స్థిరమైన జీడీపీ వృద్ధి రేటును సాధిస్తోందని కోర్న్ ఫెర్రీ సర్వే తేల్చింది. భారత జీడీపీ వృద్ధి రేటు 6శాతం ఉంటుందని తేల్చిన సదరు సర్వే.. భారత్ రానున్న రోజుల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తుందని తేల్చింది. అటు కరోనా నాటి పరిస్థితిని పూర్తిగా అధిగమించినట్లు కూడా ఆ సర్వే పేర్కొంది.