National

జూన్ 2024 వరకు నడ్డానే బీజేపీ చీఫ్

BJP జాతీయ కార్యవర్గ కమిటీ సమావేశాలు ఢిల్లీలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్ష ఎన్నిక విషయమై బీజేపీ సీనియర్ నేత అమిత్ షా స్పష్టతనిచ్చారు. కొరోనా మహమ్మారి కారణంగా పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయలేకపోయామన్నారు. పార్టీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగుతారని ఢిల్లీలో జరుగుతున్న జాతీయ కార్యవర్గ కమిటీ సమావేశాల్లో బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. జూన్ 2024 వరకు నడ్డా అధ్యక్షత కొనసాగుతుందన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. జేపీ నడ్డా నేతృత్వంలో బీజేపీ దేశవ్యాప్తంగా బలపడిందన్నారు. ”కొరోనా మహమ్మారి వల్ల సంస్థాగతంగా పార్టీ బూత్ లెవెల్ ఎన్నికలను కూడా నిర్వహించలేకపోయాం. ఆ ప్రభావం అధ్యక్ష ఎన్నికలపై కూడా పడింది.

అందువల్ల, జూన్ 2024 వరకు పార్టీ అధ్యక్షుడిగా జేపీ నడ్డానే కొనసాగించాలని ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించాం” అని అమిత్ షా వివరించారు. దేశంలో పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు. జేపీ నడ్డా బీజేపీ అధ్యక్ష బాధ్యతలను 2020 జనవరిలో స్వీకరించారు. అప్పటివరకు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షాను కేంద్ర హోం మంత్రిగా నియమించడంతో నడ్డాకు అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. మొదట వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించి, ఆ తరువాత, మూడేళ్ల కాల పరిమితితో పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుత కొనసాగింపుతో, జూన్ 2024 వరకు జేపీ నడ్డానే అధ్యక్షుడిగా ఉంటారు. అంటే, 2024లో జరిగే లోక్ సభ ఎన్నికలకు బీజేపీ నడ్డా నాయకత్వంలోనే వెళ్తుందని స్పష్టమవుతుంది.