ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై, 2002 గుజరాత్ అల్లర్లపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ పట్ల భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అపఖ్యాతి పాలుచేసేందుకు రూపొందించిన, పక్షపాత ధోరణితో కూడిన ప్రచారమని ఆక్షేపించింది. వివరాలివే.. “దీన్ని గుర్తుంచుకోండి. ఇండియాలో ఇది ప్రసారం కాలేదు. కాబట్టి నేను దాని గురించి విన్నది, నా సహచరులు చూసి చెప్పిన దాన్ని బట్టి నేను వ్యాఖ్యానిస్తున్నా. అపకీర్తి పాలుచేసేందుకు ఈ కథనాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చిందని మేం భావిస్తున్నామని స్పష్టంగా చెబుతున్నా. పక్షపాతం, వలసవాద ధోరణి కొనసాగింపు ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. డాక్యుమెంటరీని రూపొందించిన ఏజెన్సీ విధానానికి, ఆలోచన ధోరణికి ఇది అద్దం పడుతోంది” అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు. ఈ డాక్యుమెంటరీ ఉద్దేశం, దాని వెనుక ఉన్న ఎజెండా తమను ఆశ్చర్యాన్నికి గురి చేస్తోందని ఆయన అన్నారు. ఇండియా: ది మోదీ క్వశ్చన్ (India: The Modi Question) పేరుతో బీబీసీ ఈ డాక్యుమెంటరీని రూపొందించింది.
రెండు భాగాల సిరీస్‍గా దీన్ని తీసుకొచ్చింది. తొలి భాగాన్ని బుధవారం ప్రసారం చేయగా.. తీవ్ర విమర్శలు రావటంతో యూట్యూబ్ నుంచి దాన్ని తొలగించింది. జనవరి 24న రెండో ఎపిసోడ్ రావాల్సింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నప్పుడు జరిగిన పరిణామాలు అంటూ ఈ డాక్యుమెంటరీని బీబీసీ రూపొందించింది. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా ఈ డాక్యుమెంటరీపై స్పందించారు. ఈ దేశ పార్లమెంట్‍లో పాకిస్థాన్ సంతతికి చెందిన ఓ ఎంపీ ఈ డాక్యుమెంటరీ గురించి మాట్లాడారు. భారత ప్రధానిపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆ ఎంపీ చెప్పిన మాటల్లో సత్యం ఉందని తాను అంగీకరించలేనని సునాక్ చెప్పారు. భారత్‍లో ఈ డాక్యుమెంటరీ ప్రసారం కాకున్నా.. వేరే దేశాల్లో దీన్ని చూసిన భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూకే పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్ మెంబర్ లార్డ్ రామి రేంజర్.. బీబీసీ డాక్యుమెంటరీని తీవ్రంగా ఖండించారు. కోట్లాది మంది భారతీయులను, భారత ప్రభుత్వాన్ని బాధపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.