కర్ణాటకలో ఇద్దరు సీనియర్ మహిళా ఐఏఎస్, ఐపీఎస్ అధికారిణుల మధ్య పోరు చర్చనీయాశంగా మారింది. చివరికి ఆ రాష్ట్ర హోంమంత్రి జోక్యం చేసుకునే వరకు చేరింది. ఇద్దరు ఉన్నతాధికారిణులపై చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి హెచ్చరించారు. ఇంతకు ఏం జరిగింది..? ప్రభుత్వ ఆగ్రహానికి కారణం ఏమిటి..? ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి ప్రస్తుతం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌గా ఉన్నారు. ఐపీఎస్ అధికారిణి డి.రూప మౌద్గిల్ కర్ణాటక హస్తకళల అభివృద్ధి సంస్థలో ఐజీపీ ఎండీగా పనిచేస్తున్నారు. రోహిణి సింధూరిని విమర్శిస్తూ.. ఆమెకు సంబంధించిన వ్యక్తిగత ఫొటోలను రూపా మౌద్గిల్ సోషల్ మీడియాలో షేర్ చేయడం కలకలం రేపుతోంది. రోహిణి అవినీతి అక్రమాలు ఇవి అంటూ ఆరోపణలు గుప్పించారు. వృత్తి పరమైన నియమాలను ఉల్లంఘించారని.. ఆమెపై ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని నిలదీశారు. ఈ ఫొటోలను రోహిణి గతంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు షేర్ చేశారని తెలిపారు. ఈ ఆరోపణలపై రోహిణి ఫైర్ అయ్యారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యక్తిగత ఫొటోలు షేర్ చేసిన రూపాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టంచేశారు.
తన పరువుకు భంగం కలిగిచేందుకు తన సోషల్ మీడియా, వాట్సాప్ స్టేటస్ స్క్రీన్‌షాట్లను సేకరించారని.. తాను ఎవరికి పంపించానో ఆ వ్యక్తుల పేర్లు చెప్పాలని డిమాండ్ చేశారు. రూపా మౌద్గిల్ మతిస్థిమితం కోల్పోయారని.. ఎప్పుడు వార్తల్లో ఉండాలనే తపనతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బాధ్యతయుతమైన పదవిలో ఉండి ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. ఇద్దరు ఉన్నతాధికారుణులు బహిరంగంగా సోషల్ మీడియాలో విమర్శలు చేసుకోవడంపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్ అయింది. వారి ప్రవర్తనపై చర్యలు తీసుకుంటామని కర్ణాటక హోంమంత్రి స్పష్టం చేశారు. సామాన్యులు కూడా ఇలా పబ్లిక్‌గా విమర్శించుకోరని.. వ్యక్తిగతం ఎలాంటి శత్రత్వం ఉన్నా మీడియా ముందు ఇష్టానుసారం మాట్లాడటం సరికాదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం కళ్లు మూసుకోవడం లేదన్నారు. ఇద్దరు మహిళా అధికారుణుల తీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుందన్నారు. వారి ప్రవర్తన కారణంగా.. మంచి అధికారులకు చెడ్డ పేరు వస్తుందన్నారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, డీజీతో మాట్లాడానని.. నిబంధనల ప్రకారం చర్యలు ప్రారంభిస్తామన్నారు.