National

చెన్నై న గరంలో విషాదం

చెన్నై న గరంలో విషాదం చోటు చేసుకుంది. గుడి చెరువులో మునిగి ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని నాంగనల్లూరులో ఉన్న ధర్మలింగేశ్వర ఆలయ కోనేరులో పడి విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు.

 

నాంగనల్లూరులో ఉన్న ధర్మలింగేశ్వర ఆలయంలో తీర్థవారి ఉత్సవాలు జరుగుతున్నాయి. స్థానిక అధికారులకు కానీ, పోలీసులకు కానీ సమాచారం ఇవ్వకుండానే ఆలయ నిర్వాహకులు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన విద్యార్థులు ఆలయ సంప్రదాయంలో భాగంగా ఆలయ సమీపంలోని చెరువులో స్నానం చేయడానికి వెళ్లారు. ఐదుగురు విద్యార్థుల్లో ఒకరు ఆ నీటిలో మునిగిపోతుండగా, కాపాడడానికి ప్రయత్నించిన మిగతా నలుగురు విద్యార్థులు కూడా నీళ్లలో మునిగిపోయి చనిపోయారు.

 

ఈ దుర్ఘటన పట్ల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఘటనాస్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని స్థానిక మంత్రి ని ఆదేశించారు. పోలీసులకు, అధికారులకు సమాచారం ఇవ్వకుండా, అజాగ్రత్తగా ఈ కార్యక్రమం చేపట్టిన ఆలయ నిర్వాహకులపై చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి ప్రకటించారు.