APNational

శింగనమలలో రైతన్నతో లోకేష్‌ ముఖాముఖీ. ఇంతలోనే ఎంత పరిణతి!

టిడిపి యువనేత నారా లోకేష్‌ నేడు అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో 64వ రోజు పాదయాత్ర ముగింపుగా ‘రైతన్నతో ముఖాముఖీ’ పేరుతో రైతులతో సమావేశమవుతున్నారు.

ఈ సందర్భంగా రైతులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికల తర్వాత మన టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వ్యవసాయం కోసం, రైతుల కోసం ఏమేమి చేయాలో మీ అందరినీ అడిగి తెలుసుకొనేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశాము. ఈ సమావేశంలో పాల్గొన్న రైతులందరూ మీ సమస్యలు, అవసరాల గురించి నాకు చెప్పండి. ప్రభుత్వం నుంచి మీరు ఏమి ఆశిస్తున్నారో చెప్పండి. మీరు చెప్పినవాటిని బట్టి మేము రైతులకు మేలు చేసే విధానం అమలుచేస్తాము. కనుక మీరు నిర్భయంగా మీరు చెప్పదలచుకొన్నది చెప్పాలని కోరుతున్నాను,” అని కోరారు.

టంగుటూరు నుంచి ఓ కౌలురైతు తన ప్రశ్నని వీడియో రికార్డ్ చేసి పంపాడు. కౌలురైతులను ఆదుకోవడానికి టిడిపి ప్రభుత్వం ఏమి చేయబోతోందో చెప్పాలని అడగగా, నారా లోకేష్‌ సమాధానమిస్తూ, “రాష్ట్రంలో వ్యవసాయభూమిని చాలా వరకు కౌలురైతులే సాగుచేస్తున్నారు. కనుక కౌలురైతుల కోసమే ప్రత్యేకంగా పాలసీని ప్రవేశపెడతాము. దాంతో కౌలురైతులకు తప్పకుండా మేలు చేస్తానని నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను,” అని నారా లోకేష్‌ చెప్పారు.

రమేష్ అనే టోమెటో రైతు, “మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే టోమెటో, హార్టికల్చర్ పంటలకు ఏవిదంగా సాయపడతారు?” అంటూ ప్రశ్నించగా, నారా లోకేష్‌ సమాధానమిస్తూ, “టోమెటో వంటి పంటలకు ఒక్కో రోజు మంచి ధర పలుకుతుంది. ఒక్కోసారి కేజీ టోమెటో ధర ఒక్క రూపాయికి పడిపోతుంటుంది. ఈ సమస్య తీవ్రతను 2018లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గుర్తించి ఈ పంటలను ఉపాది హామీ పధకంతో అనుసంధానం చేశారు. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం రూ.70 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ.40 కోట్లతో ‘టోమెటో వాల్యూ చెయిన్ సిస్టమ్’ ప్రారంభించారు. అయితే ప్రభుత్వం మారడంతో ఆ పధకం నిలిచిపోయింది. ఇటువంటి పంటలకు మార్కెట్‌ లింకేజీ చాలా అవసరం. కనుక ఎక్కడికక్కడ టోమెటో ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తే, రైతులు ఎంత భారీగా టోమెటోలు పండించినా ధరలలో హెచ్చు తగ్గులు లేకుండా వాటికి సరఫరా చేసుకొని లాభపడతారు. అందుకే నేను మదనపల్లిలో టోమెటో రైతులకు కోల్డ్ స్టోరేజి సౌకర్యంతో పాటు టోమెటో ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాను. దానికి టిడిపి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది,” అని చెప్పారు.

ఇన్‌పుట్ సబ్సీడీ గురించి ఓ రైతు అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ, “ప్రస్తుతం ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు అన్నిటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కనుక ఆ ధరలతో రైతులు లాభం సంపాదించలేరు. కనుక వాటి కొనుగోలుకు ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సీడీ ఇవ్వడంతో బాటు ఏదో విదంగా వాటి ధరలు తగ్గించాల్సిన అవసరం కూడా ఉందని మేము గుర్తించాము. పెట్రోల్, డీజిల్ మీద రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నును తగ్గించుకొంటే అన్నిటి ధరలు తప్పకుండా తగ్గుతాయి. కనుక టిడిపి అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ మీద రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నును తగ్గిస్తామని నేను హామీ ఇస్తున్నాను,” అని నారా లోకేష్‌ అన్నారు.

మద్య మద్యలో మైక్ సరిగ్గా పనిచేయకపోవడంతో నారా లోకేష్‌ వేదిక దిగి నేరుగా రైతుల వద్దకే వెళ్ళి వారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంతో, తమ పట్ల నారా లోకేష్‌ అంత గౌరవం చూపుతూ తమ వద్దకే వచ్చి సమస్యలు అడిగి తెలుసుకోవడంతో వారు చాలా సంతోషించారు. నారా లోకేష్‌ ఈ సమావేశం ప్రారంభించే ముందే చెప్పారు. నేనేదో ఊక దంపుడు ప్రసంగం చేసి వెళ్లిపోవడానికి రాలేదు. మీ సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకొందామనే వచ్చాను,” అంటూ చెప్పడమేకాక వారి సమస్యలపై చక్కటి అవగాహనతో, ఎంతో పరిణతితో చక్కగా సమాధానాలు చెప్పి రైతులను ఆకట్టుకొన్నారని రైతుల కళ్ళలో కనబడిన ఆనందమే చెపుతోంది.