సోమవారం ఉదయం నుంచి 36 గంటల వ్యవధిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) 5300 కిలోమీటర్లు ప్రయాణించి, 7 నగరాల్లో ఎనిమిది కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి బయల్దేరి 36 గంటల వ్యవధిలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సెంట్రల్ ఇండియాలోని మధ్య ప్రదేశ్, దక్షిణాదిన ఉన్న కేరళ, కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ, డయ్యూ, డామన్ లలో పర్యటిస్తారు. తిరిగి మంగళవారం సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటారు. పీఎంఓ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రధాని మోదీ (PM Modi) మొదట ఢిల్లీ నుంచి సుమారు 500 కిమీలు ప్రయాణించి మధ్య ప్రదేశ్ లోని ఖజూరహోకు వెళ్తారు. అక్కడి నుంచి రేవా (Rewa) కు వెళ్లి, అక్కడ నేషనల్ పంచాయతి రాజ్ దినోత్సవ (National Panchayati Raj Day) కార్యక్రమంలో పాల్గొంటారు. రేవా నుంచి మళ్లీ ఖజూరహో కు వెళ్లి, అక్కడి నుంచి 1700 కిమీల దూరంలో ఉన్న కేరళ లోని కొచ్చి కి వెళ్తారు. అక్కడ యువం కాంక్లేవ్ (Yuvam Conclave) లో పాల్గొంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రాత్రి కొచ్చిలోనే బస చేస్తారు. ఆ తరువాత మంగళవారం ఉదయం కొచ్చి నుంచి బయల్దేరి తిరువనంత పురం వెళ్తారు. అక్కడ వందే భారత్ (Vande Bharat Express) ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను ప్రారంభిస్తారు. అలాగే, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం తిరువనంత పురం నుంచి 1570 కిమీల దూరంలోని సిల్వాసా (Silvassa) కు వెళ్తారు. సిల్వాసా లో నమో మెడికల్ కాలేజీని ప్రారంభిస్తారు. అలాగే, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి కేంద్ర పాలిత ప్రాంతమైన డామన్ కు వెళ్తారు. అక్కడ దేవక సీ ఫ్రంట్ ను ప్రారంభిస్తారు. కేంద్ర పాలిత ప్రాంతాల పర్యటన అనంతరం, తిరిగి సూరత్ (surat) కు తిరిగి వస్తారు. సూరత్ నుంచి మంగళవారం సాయంత్రం ఢిల్లీకి బయల్దేరుతారు.