ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం మొదలు పెట్టారు. పోలింగ్ కి మరో ఐదురోజులే టైమ్ ఉండగా.. బ్రహ్మానందాన్ని ప్రచారంలోకి దించారు కమలనాథులు.
చిక్ బళ్లాపూర్ లో ఆయన ప్రచారం చేపట్టారు. బీజేపీ అభ్యర్తి సుధాకర్ కి ఓటు వేయాలంటూ అభ్యర్థించారు.
ఆ ఒక్క నియోజకవర్గమే..!
బ్రహ్మానందం కేవలం చిక్ బళ్లాపూర్ నియోజకవర్గంలోనే ప్రచారం నిర్వహిస్తారని తెలుస్తోంది. నియోజకవర్గంలోని పుర, గిడగానహళ్లి, మంచెనహళ్లి, పోశెట్టిహళ్లి, కనగానగొప్ప, జోడి బొమ్మనహళ్లి తదితర గ్రామాలో ఆయన పర్యటించారు. రోడ్ షో లు నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి, మంత్రి డాక్టర్ కె.సుధాకర్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆయన ప్రచారమంతా తెలుగులోనే కొనసాగటం విశేషం. తెలుగులో మాట్లాడుతూ, తెలుగు ప్రజల్ని ఆకట్టుకుంటూ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు బ్రహ్మానందం.
చిక్ బళ్లాపూర్ ఏపీకి సరిహద్దులో ఉన్న కర్నాటక జిల్లా కావడంతో అక్కడ ఎక్కువ మంది తెలుగు వారే ఉన్నారు. వ్యవసాయం సహా ఇతర రంగాల్లో స్థిరపడ్డారు. ఎక్కువగా తెలుగులోనే మాట్లాడుకుంటారు. ఐదు గ్రామాల్లో తెలుగు ప్రజల జనాభా ఎక్కువగా ఉండటంతో ఆయా ప్రాంతాల్లో బ్రహ్మానందం ప్రచారం చేశారు. తెలుగు ఓటర్లను ఆకట్టుకోడానికే ఆయన్ను ప్రచార రంగంలోకి దించారని తెలుస్తోంది. మంత్రి సుధాకర్ తో తనకు చాన్నాళ్లుగా పరిచయం ఉందని, డాక్టర్ గా, మంత్రిగా ఆయన చేసిన సేవలు తనకు తెలుసు కాబట్టే, ఆయన తరపున స్వచ్ఛందంగా ప్రచారానికి వచ్చానంటున్నారు బ్రహ్మానందం. మరో నటుడు దర్శన్, లోక్ సభ సభ్యుడు పీసీ మోహన్, అభ్యర్థి సుధాకర్ తో కలసి బ్రహ్మానందం రోడ్ షోలు చేపట్టారు. బ్రహ్మానందాన్ని చూసేందుకు తెలుగు ప్రజలు చాలామంది రోడ్ షో లకు హాజరయ్యారు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు, సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించారు. బ్రహ్మానందం ప్రచారం బాగానే ఉంది కానీ, ఆయన మాటలు విన్న తెలుగువారంతా సుధాకర్ కి ఓటు వేస్తారా లేదా అనేది మాత్రం అనుమానమే.