National

మహారాష్ట్రలో ఎన్నికల్లో తొలి విజయం; ఖాతా తెరిచిన బీఆర్ఎస్ పార్టీ!!

తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా కాలంగా మహారాష్ట్ర రాజకీయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించడానికి కెసిఆర్ చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయనే చెప్పాలి.

తాజాగా మహారాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తొలి విజయం నమోదు చేసుకుంది.

మహారాష్ట్రలోని అంబే లోహల్ గ్రామంలో జరిగిన గ్రామ పంచాయతీ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థి గఫూర్ పఠాన్ విజయం సాధించారు. 115 ఓట్ల తేడాతో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచారు. దీంతో మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. దీంతో మహారాష్ట్ర ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఖాతా తెరిచి మొదటి విజయాన్ని నమోదు చేసుకున్నట్టు అయ్యింది.

ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన నేపథ్యంలో నేడు మహారాష్ట్ర లో పర్యటించారు. నాందేడ్ జిల్లా పార్టీ శిక్షణ తరగతులకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హాజరై అక్కడి నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ శిక్షణా తరగతులలో పార్టీని మహారాష్ట్రలో ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి? ఏ అంశాలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలి? వంటి అనేక అంశాలపై పార్టీనేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

మహారాష్ట్రలోని నాందేడ్ లో నిర్వహించిన శిక్షణ తరగతులలో మాట్లాడిన కేసీఆర్ దేశంలో రైతులు బాగు పడే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదన్నారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అయినా దేశంలో సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య అనుబంధం ఉందని చెప్పిన కేసీఆర్ వేల కిలోమీటర్ల మేర రెండు రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనతికాలంలోనే సమస్యలను పరిష్కరించుకున్నామని, మహారాష్ట్రలో సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలని, కడదాకా నిలబడి పోరాడే సత్తా ఉన్నవాళ్లే బీఆర్ఎస్ పార్టీలో చేరాలని ఆయన సూచించారు. త్వరలోనే పార్టీ కమిటీలు నియమించుకుందాం అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు.