National

కేజ్రివాల్ కు అండగా కాంగ్రెస్ ? ఢిల్లీ బిల్లును రాజ్యసభలో వ్యతిరేకించాలని నిర్ణయం..

ఢిల్లీలో ఆప్ సర్కార్ కు, కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ కూ మధ్య జరుగుతున్న పోరుకు ఫుల్ స్టాప్ పెడుతూ సుప్రీంకోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది.

దీని ప్రకారం హోంశాఖ మినహా మిగిలిన అంశాల్లో ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే పైచేయి అవుతుందని తేల్చిచెప్పింది. దీంతో కేంద్రానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు అమలుకాకుండా చూసేందుకు కేంద్రం పార్లమెంటులో ఓ బిల్లు పెట్టేందుకు సిద్ధమవుతోంది.

ఢిల్లీలో సేవలపై పెత్తనాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కే కట్టబెడుతూ ఇప్పటికే ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన కేంద్రం.. త్వరలో మొదలయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ మేరకు ఢిల్లీ సేవల బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే ముందుగా రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ రాజ్యసభలో ఎన్డీయేకు మెజారిటీ లేదు. మొత్తం 238 సభ్యుల్లో కేవలం 110 మంది మాత్రమే ఎన్డీయే సభ్యులున్నారు. దీంతో ఎప్పటిలాగే వైసీపీ, బీజేడీ, టీడీపీ వంటి పార్టీల మద్దతుతో గట్టెక్కాలని భావిస్తోంది.

ఈ నేపథ్యంలో విపక్షాలను కేజ్రివాల్ మద్దతు కోరుతున్నారు. ఢిల్లీ సేవల బిల్లును పార్లమెంటులో అడ్డుకోవాలని ఇప్పటికే విపక్ష నేతల్ని కలిపి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే మమత, స్టాలిన్, నితీశ్ వంటి వారు ఈ బిల్లును వ్యతిరేకించినా కాంగ్రెస్ సాయం లేకుండా బీజేపీని అడ్డుకోవడం అసాధ్యం. దీంతో ఇప్పటివరకూ తాను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ను అడగలేక, అలాగని మౌనంగా ఉండలేక కేజ్రివాల్ మల్లగుల్లాలు పడుతున్నారు.