National

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో సంచలన విషయాలు: బ్లూటూత్‌తో పరీక్ష రాశారు, నలుగురి అరెస్ట్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా మరో నలుగురిని ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) అరెస్ట్ చేసింది.

వరంగల్ విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజినీర్(డీఈ) రమేష్ తోపాటు ప్రశాంత్, మహేశ్, నవీన్ అరెస్ట్ అయినవారిలో ఉన్నారు.

ఏఈఈ, డీఏవో పరీక్షకు సంబంధించిన 25 ప్రశ్నపత్రాలను డీఈ రమేష్ విక్రయించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఏఈఈ పరీక్షలో ఏడుగురు అభ్యర్థులకు పరీక్ష హాల్‌లోకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జట్స్ ద్వారా డీఈ రమేష్ సమాధానాలు అందించినట్లు తేలింది.

బ్లూటూత్ పెట్టుకుని పరీక్షలు రాశారు

టీఎస్పీఎస్సీలో మరో సంచలన విషయం వెలుగు చూసింది. పేపర్ లీకేజీ నిందితులు ఎలక్ట్రానిక్‌ డివైజ్‌తో పరీక్ష రాసినట్లు సిట్ అధికారులు తేల్చారు. ఎలక్ట్రానిక్ డివైజ్‌తో ఎగ్జామ్ రాసిన నిందితులు ప్రశాంత్‌, మహేశ్‌, నవీన్‌లను అరెస్ట్‌ చేశారు. ఈ ముగ్గురు కూడా రమేష్‌ ద్వారా ఏఈఈ పేపర్ పొందినట్లు తెలిపారు. పరీక్ష సమయంలో నిందితులకు రమేష్‌ సమాధానాలు చెప్పారని అధికారులు వెల్లడించారు. రమేష్ సమాధానాలు చెప్తుంటే..నిందితులు బ్లూటూత్‌లో విని రాసినట్టు సిట్‌ అధికారులు గుర్తించారు.

కట్టుదిట్టంగా నిర్వహించే పరీక్ష హాల్‌లోకి ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు ఎలా వెళ్లాయనే దానిపై సిట్ అధికారులు సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. కాగా, టీఎస్పీఎస్సీలో రమేష్ ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేశాడు. టీఎస్పీఎస్సీ కేసులో ఇప్పటికే రమేష్‌ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన ఏఈఈ పేపర్‌ లీక్‌లో ఇప్పటివరకు 43 మందిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో అరెస్ట్ చేసిన వారి సంఖ్య 46కు చేరుకుంది.