న్యూఢిల్లీ: తెలంగాణ భవన్ ప్రాంగణంలో మంచిర్యాలకు చెందిన ఆరిజిన్ డెయిర్ సీఈవో బోడపాటి శేజల్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
వెంటనే స్పందించిన తెలంగాణ భవన్ సిబ్బంది ఆమెను ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి కొంత నిలకడగా ఉన్నట్లు తెలిసింది.
శేజల్ గత కొంతకాలంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. మానసికంగా, లైంగికంగా ఎమ్మెల్యే చిన్నయ్య వేధిస్తున్నాడని ఆరోపించింది.రెండ్రోజుల క్రితం ఢిల్లీలోని మహిళా కమిషన్, మానవ హక్కుల సంఘం(హెచ్ఆర్సీ) ని కలిసి ఫిర్యాదు కూడా చేసింది. బీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను మానసికంగా, లైంగికంగా వేధిస్తూ.. చంపుతానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు.
తనపై తప్పుడు కేసులు పెట్టించి భయాందోళనలకు గురిచేస్తున్నాడని ఆమె తెలిపారు. దీనిపై తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఫిర్యాదులో కోరారు. ఎమ్మెల్యే తమను లైంగికంగా వేధిస్తున్నారని… తనకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని శేజల్ తెలిపారు.
ఇప్పటికే తమపై తప్పుడు కేసులు పెట్టారని.. బెయిల్‌పై బయటకు వచ్చినా.. బెదిరిస్తున్నారని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ అపాయింట్మెంట్ అడిగానని.. కానీ ఇవ్వడం లేదంటూ శేజల్ తెలిపారు. తనలాగే ఎంతోమంది బాధితులున్నారని శేజల్ పేర్కొన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే పెద్ద ఉమనైజర్ అని.. తన దగ్గర అన్ని ఆధారాలన్నాయని.. వాటిని భద్రంగా ఉంచామని తెలిపారు.
తెలంగాణ పోలీసులు ఫిర్యాదు తీసుకోవడం లేదని.. తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశామని బాధితురాలు శేజల్ తెలిపారు.కాగా, తాజాగా, శుక్రవారం ఆమె బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. మరోవైపు తన ఆత్మహత్యపై శేజల్ లేఖ రాసింది.