TELANGANA

తెలంగాణతోపాటే, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ముందస్తు ఎన్నికలు

తెలంగాణతోపాటే, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం జరుగుతోంది. దీన్ని అటు అధికార పార్టీ నాయకులు కూడా ఖండించడం లేదు.

ముందస్తు ఎన్నికలకు వెళితే వైసీపీ పార్టీకి లాభమా? నష్టమా అన్న ప్రశ్నలకు లాభమే ఎక్కువనే సమాధానాలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా బిజేపీ వ్యతిరేక ఓట్ల శాతం పెరుగుతోంది. తాజాగా కర్ణాటక అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఈ అభిప్రాయాన్ని మరింత బలపరుస్తోంది.

ఏపీలో వైసీపీ- బిజేపీ ఒక్కటే అనే భావన వచ్చేందుకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నిత్యం ప్రయత్నిస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో పార్లమెంటుకంటే, అసెంబ్లీకి విడిగా అంటే ముందస్తుగా ఎన్నికలు జరిగితే ఈ తరహా ప్రచారానికి ఆస్కారం ఉండదనేది వైసీపీ ముఖ్య నేతల భావన. టీడీపీ-జనసేన పొత్తు ఇంకా ప్రజల్లోకి పూర్తిగా వెళ్లలేదు. టిడిపి-జనసేన మధ్య పొత్తులు, సీట్ల వ్యవహారం ఒక కొలిక్కి రాకముందే వైసీపీ అభ్యర్థులను ప్రకటించేందుకు కూడా జగన్ సిద్ధపడిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను కూడా ప్రకటించారు.

 

2019 ఎన్నికల్లో ఎలాంటి పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసిన వైసీపీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 22 పార్లమెంటు స్థానాల్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. 49.95 శాతం ఓట్లు వైసీపీకి పడగా, 39.17 శాతం ఓట్లతో తెలుగుదేశం 23 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలను గెలుచుకుంది. ఒంటరిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు ఒకే ఒక్క అసెంబ్లీ సీటు గెలవగా, 5.53 శాతం ఓట్లు పడ్డాయి.

సినీ హీరోగా, అశేష అభిమానులున్న పవన్ కళ్యాణ్ రెండు చోట్లు పోటీ చేస్తే ఒక్క చోట కూడా గెలవలేకపోయారు. ఇక కాంగ్రెస్ పార్టీ నోటాకుపడ్డ ఓట్లను కూడా తెచ్చుకోలేక 1.17 శాతం ఓట్లను ఖాతాలో వేసుకుంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటలుగా ఉన్న అనంతపురం లాంటి జిల్లాల్లో సైతం వైసీపీ స్వీప్ చేసింది. గత ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి- టిడిపికి మధ్య ఓట్ల శాతం పదికంటే ఎక్కువే.