National

ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయల్దేరిన విమానం రష్యాకు మళ్లింపు: ఎందుకంటే?

న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు బయల్దేరిన ఓ ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది.

దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా రష్యాకు మళ్లించారు. చివరకు ఎయిర్ ఇండియా విమానం AI173 అక్కడ సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ విషయాన్ని ఎయిరిండియా అధికారులు తెలిపారు.

ఢిల్లీ నుంచి శాన్‌ప్రాన్సిస్కోకు బయల్దేరిన ఎయిరిండియా విమానం AI173 ఓ ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు గుర్తించారు. ఈ క్రమంలో వెంటనే విమానాన్ని రష్యా వైపు మళ్లించాలని నిర్ణయించారు. అనంతరం రష్యాలోని మాగదన్ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.

ఆ సమయంలో విమానంలో 216 మంది ప్రయాణికులతోపాటు 16 మంది సిబ్బంది ఉన్నట్లు ఎయిరిండియా వెల్లడించింది. అక్కడ దిగిన వెంటనే ప్రయాణికులకు అవసరమైన వసతి కల్పించడంతోపాటు వారి గమ్యస్థానాలకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఎయిరిండియా అధికారులు తెలిపారు. విమానానికి తప్పనిసరి తనిఖీలన్నీ చేస్తున్నామని ఎయిరిండియా అధికార ప్రతినిధి వెల్లడించారు.

కాగా, ప్రయాణికులు విమానాన్ని మళ్లించడంతో కొంత ఆందోళనకు గురయ్యారు. అయితే, విమాన సిబ్బంది ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారని చెప్పారు. ఇక రష్యాలోని విమానాశ్రయంలో ఎయిరిండియా విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో తామంతా ఊపిరిపీల్చుకున్నామని చెప్పారు.

ఇది ఇలావుండగా, రెండు రోజుల క్రితం దిబ్రూఘర్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానంలోనూ సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో గౌహతిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. 6E-2652 ఫ్లైట్‌లో 150 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఇందులో పెట్రోలియం కేంద్ర సహాయ మంత్రి రామేశ్వర్ తేలి, ఇద్దరు అస్సాం బీజేపీ ఎమ్మెల్యేలు – ప్రశాంత ఫుకాన్, తెరష్ గోవాలా ఉన్నారు.