చంద్రయాన్ 3 సక్సెస్ తో యావత్ భారతదేశం సంబరాలతో మునిగిపోయింది. ప్రపంచ దేశాల ముందు భారతదేశము గర్వపడేలా చేసింది.
ఈ మహత్కార్యంలో తెలుగు వారి భాగస్వామ్యం కీలకంగానే ఉంది. చంద్రయాన్త్రీలో మిషన్ డైరెక్టర్ గా పనిచేసిన శ్రీకాంత్ మోటమర్రిది విశాఖనగరం. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ వెల్లడించారు. ఒకటి భారీ మిషన్ వెనుక ఉన్న కీలక వ్యక్తుల్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఇందులో ఇద్దరు తెలుగు శాస్త్రవేత్తలు ఉండడం విశేషం.
శ్రీకాంత్ మోటమర్రిది విశాఖలోని సీతమ్మధార. ఆయన తండ్రి ఎంఎస్ఎన్ మూర్తి ఉమ్మడి ఏపీలో ఇంజనీర్ గా పనిచేశారు. ప్రస్తుతం బెంగళూరులో స్థిరపడ్డారు. శ్రీకాంత్ గ్రాడ్యుయేషన్ మొత్తం ఆంధ్రాలోనే జరిగింది. మచిలీపట్నంలో డిగ్రీ ప్రథమ సంవత్సరం, విశాఖ ఏవీఎన్ కాలేజీలో సెకండీయర్, ఫైనల్ ఇయర్ చదివారు. తరువాత ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తి చేశారు.అనంతరం మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో ఎంటెక్ చేశారు. ఎంటెక్ అనంతరం బెంగళూరు ఇస్రోలో సైంటిస్ట్ గా చేరారు. వివిధ హోదాల్లో పని చేశారు. చంద్రయాన్ 2 కు డిప్యూటీ మిషన్ డైరెక్టర్ గా వ్యవహరించారు. తాజాగా చంద్రయన్ 3 కి మిషన్ డైరెక్టర్ గా పని చేశారు.చంద్రయాన్ 3 సక్సెస్ లో తన వంతు పాత్ర పోషించారు.
మరో తెలుగు అమ్మాయి బొల్లు మానస సైతం ప్రాజెక్టులో భాగస్వామ్యం అయ్యారు. మానసాది బాపట్ల జిల్లా అమృతలూరు. విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా జాబిల్లిపై దిగే సాఫ్ట్వేర్ టెస్టింగ్ కీలక శాస్త్రవేత్తల బృందంలో ఆమె ఒకరు. ఉద్యోగరీత్యా మానస తల్లిదండ్రులు వనజ కుమారి, అనిల్ కుమార్ గుంటూరులో స్థిరపడ్డారు. మానస కేరళలోని తిరువనంతపురం ఐఎస్టి కళాశాలలో ఏవియానిక్స్ చదివారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో శాస్త్రవేత్తగా ఎదిగారు. చంద్రయాన్ టూ ప్రాజెక్టులో సైతం సాఫ్ట్వేర్ టెస్టింగ్ విభాగంలో పని చేశారు. తాజాగా చంద్రయాన్ 3 లో సక్సెస్ ఫుల్ రోల్ పోషించారు. వీరిద్దరి నైపుణ్యం తెలుగు వారికే గర్వకారణంగా మారింది. వారికి, వారి కుటుంబానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.