నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా వస్తోందంటూ కొన్నాళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో వార్త హల్ చల్ చేస్తోంది. ఏపీ అసెంబ్లీకి 2024లో ఎన్నికలు జరగాల్సి ఉంది.
రాజకీయ నేపథ్యంలో సినిమా తీసి విడుదల చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. లెజెండ్ సినిమాకు పార్ట్-2 అనుకున్నారు. హిట్ కాంబినేషన్ కావడంతో నిర్మాతలు కూడా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తీయడానికి పోటీపడ్డారు. అయితే తాజాగా ఈ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది.
రాజకీయ నేపథ్యంలో సినిమా తీస్తే పార్టీకి కూడా ఉపయోగపడుతుందని బాలయ్య భావించారు. ఈనెల 10వ తేదీన తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బాలయ్య-బోయాపాటి సినిమా ప్రకటన అధికారికంగా వస్తుందనుకున్నారు. అయితే సమీకరణాలన్నీ మారిపోయాయి. బోయపాటి శ్రీనుతో కాకుండా బాబీ దర్శకత్వంలో తన తదుపరి సినిమాను బాలకృష్ణ చేయబోతున్నారు.
బాలయ్య 109వ సినిమా బాబీతోనే తీస్తున్న వార్త ఖరారైంది. బోయపాటి సినిమా ఎప్పుడు ఉంటుందో చెప్పలేని పరిస్థితి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూర్తయ్యేసరికి బాలయ్యకు టైమ్ పడుతుంది. ఈలోగా రామ్ కథానాయకుడిగా బోయపాటి చేస్తున్న సినిమా కూడా పూర్తవ్వాల్సి ఉంది. ఈ రెండూ జరిగితేనే వీరిద్దరి కాంబినేషన్ పట్టాలెక్కుతుంది.
ఈలోగా 2024 అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడిపోతాయి. హడావిడిగా ఎన్నికల కోసం సినిమా చేసి విడుదల చేస్తే మొదటికే మోసం వస్తుందనుకున్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి అంత హడావిడిగా సినిమా చేయాల్సిన అవసరం లేదని బాలయ్య, బోయపాటి భావించారు. తాత్కాలికంగా ఈ సినిమాను పక్కన పెట్టారు. వీరిద్దరి కాంబోలో సినిమా ఉంటుందికానీ అది ఎన్నికలు పూర్తయిన తర్వాతే అనే స్పష్టత వచ్చింది. బాలయ్య పుట్టినరోజుకు బాబీ దర్శకత్వంలో సినిమా ప్రారంభం కాబోతోంది.