National

భలే షాకిచ్చిన సిద్ధరామయ్య: విద్యుత్ ఛార్జీలు భారీగా పెంపు- ఉచితాల భారం జనంపైనే

బెంగళూరు: కర్ణాటకలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అయిదు హామీలు అతి కీలకమైనవి. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ప్రతి ఇంటికీ ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా, ప్రతి మహిళకూ ప్రతినెలా 2,000 రూపాయల నగదు బదిలీ, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ 10 కేజీల ఉచిత బియ్యం..

వంటివి ఇందులో ఉన్నాయి.

ఈ నెల 11వ తేదీ నుంచి కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. దీనికి అవసరమైన పాలన అనుమతులు కూడా మంజూరయ్యాయి. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి శక్తి స్మార్ట్ కార్డ్‌ను తప్పనిసరి చేసింది. కర్ణాటకలో తిరుగాడే ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుంది.

గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ప్రతి ఇంటికీ ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయడానికి కూడా కసరత్తు పూర్తి చేసింది. జులై 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది. గృహావసర వినియోగదారులు ప్రతి నెలా 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వాడుకుంటేనే గృహజ్యోతి పథకం వర్తిస్తుంది. దానికి మించి ఒక్క యూనిట్‌ను అదనంగా వాడుకున్నా- మొత్తం 200 యూనిట్లకూ బిల్లును చెల్లించాల్సి ఉంటుందనేది నిబంధన.

ఈ పరిణామాల మధ్య సిద్ధరామయ్య సర్కార్.. సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచేసింది. ఉచిత విద్యుత్‌ పథకాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో- దీనికి అయ్యే వ్యయాన్ని ప్రజల నుంచే వసూలు చేయనుంది. యూనిట్ ఒక్కింటికి 2.89 పైసల మేర విద్యుత్ ఛార్జీలను పెంచింది. ప్రతినెలా 200 యూనిట్లకు మించి విద్యుత్‌ను వినియోగించే వారిపై ఈ భారాన్ని మోపింది.

200 యూనిట్ల స్లాబ్‌కు మించి విద్యుత్‌ను వాడుకునే వినియోగదారులను పెంపు పరిధిలోకి తీసుకొచ్చింది. 200లకు మించి ఒక్క యూనిట్‌ను అదనంగా వాడుకున్నా యూనిట్‌కు రూ.2.89 పైసలను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఫ్యూయల్ అండ్ పవర్ పర్ఛేస్ ప్రైస్ అడ్జస్ట్‌మెంట్ (ఎఫ్‌పీపీసీఏ) కింద ఈ మొత్తాన్ని వసూలు చేయనుంది కర్ణాటక ప్రభుత్వం.

ప్రస్తుతం కర్ణాటకలో ఈ పవర్ పర్ఛేజ్ అడ్జస్ట్‌మెంట్ కోసం ప్రభుత్వం యూనిట్‌కు రూ. 1:49 పైసలను వసూలు చేస్తోంది. దీనికి అదనంగా రూ.2.89 పైసలను ఇక నుంచి అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఈ ఏడాది జనవరి నుంచి ఎఫ్‌పీపీసీఏ మొత్తం యూనిట్ ఒక్కింటికి 70 పైసల మేర పడుతున్న భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ వచ్చిందని కర్ణాటక ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తెలిపింది.

దీనితో పాటు ఫిక్స్డ్ ఛార్జీలను కూడా పెంచుతున్నట్లు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీలు (ఎస్కామ్స్) తెలిపాయి. ప్రస్తుతం ఫిక్స్డ్ ఛార్జీల మొత్తం 50 రూపాయలుగా ఉన్నాయి. ఈ మొత్తాన్ని 75 రూపాయలకు పెంచినట్లు తెలిపాయి. కాగా- విద్యుత్ ఛార్జీలను పెంచడం వల్ల సిద్ధరామయ్య ప్రభుత్వం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారతీయ జనతా పార్టీ ఆందోళనకు దిగడానికి సమాయాత్తమౌతోంది.