National

ఆర్వీ ఇంజినీరింగ్ పరిశ్రమలో భారీ పేలుడు: నలుగురికి తీవ్ర గాయాలు; ఖమ్మం మార్కెట్లో మంటలు

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో ఉన్న పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్వీ ఇంజినీరింగ్ పరిశ్రమలో పేలుడు సంభవించడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరందర్నీ పాటన్‌చెరులో ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్వల్పంగా గాయపడిన మరో వ్యక్తిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పాశమైలారం పారిశ్రామికవాడలో ఆర్వీ ఇంజినీరింగ్ పరిశ్రమ ఆవరణలోనే రెండు యూనిట్లు నడుపుతున్నారు. ఒకదానిలో ఆర్వీ ఇంజినీరింగ్ పరిశ్రమ నడుపుతుండగా.. అదే ఆవరణలో ఆర్వీ పాలిమర్స్ పరిశ్రమ నిర్వహిస్తున్నారు. ఆర్వీ పాలిమర్స్‌కు చెందిన రియాక్టర్ ఇంజినీరింగ్ విభాగంలో ఉంది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆకస్మత్తుగా పేలింది.

దీంతో ప్లాంట్ ఇంఛార్జీగా ఉన్న రమణారెడ్డి, అక్కడ పనిచేస్తున్న కార్మికుడు సతీష్‌కు తీవ్రంగా గాయపడ్డారు. వీరితోపాటు రమణారెడ్డిని కలిసేందుకు వచ్చిన వెంకటేశ్వర్ రావు అనే వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ముగ్గురికి తీవ్రంగా గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించడంతో పరిశ్రమలో పనిచేస్తున్న మిగితా కార్మికులు భయాందోళనలకు గురయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ఇది ఇలావుండగా, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో షార్ట్ సర్క్యూట్‌తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక మహాదేవ్ ఇండస్ట్రీలో ఉదయం పొగలు రావడం గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వచ్చి మంటలు ఆర్పివేశారు. అయితే, అప్పటికే ధాన్యం, బియ్యం, గన్ని బస్తాలు దగ్ధమయ్యాయి. సుమారు రూ. 3 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని యజమాని తెలిపాడు.