ఏపీలో మరో 9 నెలల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. వీటిలో ఎలాగైనా గెలవాలని వైసీపీ, టీడీపీ పట్టుదలగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే ఫిరాయింపుల పర్వం కూడా ఊపందుకుంటోంది. ఇదే క్రమంలో వైసీపీ నుంచి టీడీపీకి, అలాగే టీడీపీ, జనసేన నుంచి వైసీపీకి ఎమ్మెల్యేలు ఫిరాయిస్తున్నారు. ఇలా ఎమ్మెల్యేలు ఫిరాయించిన 7 సీట్లలో ఉపఎన్నికలు పెట్టాలని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ ఇవాళ డిమాండ్ చేశారు. టీడీపీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నలుగురు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చక, పార్టీ నాయకత్వంతో విభేదించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తనకు ప్రాణమిచ్చే శాసనసభాపతి ద్వారా అనర్హత వేటు వేయించి , ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నిర్వహించేందుకు సిద్ధపడాలని ఆయన కోరారు.
టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారని, ఉండవల్లి శ్రీదేవి కాకుండా, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీ నాయకత్వం, విధానాలు నచ్చక పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారని రఘురామ తెలిపారు. టీడీపీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు, వైసీపీతో విభేదించి బయటకు వెళ్లిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రఘురామ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఈ ఏడు స్థానాలకు, రాహుల్ గాంధీ సస్పెన్షన్ తో ఖాళీ అయిన లోక్ సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికతో పాటే ఎన్నిక నిర్వహించేలా జగన్ చర్యలు తీసుకోవాలని కోరారు.