National

అప్సర హత్య: పోస్టుమార్టం, రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు: అందుకే హత్య, నెట్‌లో సెర్చ్ చేసి..

హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యాయి. తాజాగా, ఉస్మానియా ఆస్పత్రిలో అప్సర మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది.

ఉస్మానియా ఫోరెన్సిక్ వైద్యుడు యాదయ్య బృందం పోస్టుమార్టం చేశారు. ప్రాథమిక నివేదికను వైద్యులు పోలీసులకు అందించారు.

తలకు బలమైన గాయాలు కావడంతోనే అప్సర ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులకు వైద్యులు తెలిపారు. అనంతరం అప్సర మృతదేహాన్ని పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో వారు సరూర్‌నగర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. తమ కూతుర్ను దారుణంగా హత్య చేసిన నిందితుడు వెంకటసాయికృష్ణను కఠినంగా శిక్షించాలని అప్సర తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

ఇది ఇలావుండగా, నిందితుడు సాయికృష్ణ.. అప్సరను హత్య చేసే ముందు ఇంటర్నెట్‌లో మనిషిన ఎలా చంపాలనే విషయాలపై వెతికినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. అప్సర హత్య కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను వెల్లడించారు. ఆమెను అడ్డు తొలగించుకునేందుకే సాయికృష్ణ హత్య చేసినట్లు తేలింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి పూజారి సాయికృష్ణ, అప్సర మధ్య పరిచయం ఏర్పడిందని.. క్రమంగా అది వివాహేతర సంబంధానికి దారితీసిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

సరూర్‌నగర్‌లోని బంగారు మైసమ్మ ఆలయం కేంద్రంగానే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. సాయికృష్ణ తరచూ అప్సరకు వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు చేస్తుండేవాడు. ఇద్దరూ గత నవంబర్ నెలలో గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం, ద్వారక గుడిని సందర్శించారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య బంధం మరింత బలపడింది. అప్సర వాట్సాప్ ద్వారా తన ప్రేమను వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసింది. తనను పెళ్లి చేసుకోకపోతే రోడ్డుకు ఈడుస్తానని బెదిరించింది. అందుకే సాయికృష్ణ ఆమెను అడ్డుతొలగించాలనుకొని హత్య చేశాడు. ఇదే విషయాన్ని అతడు కూడా అంగీకరించాడు అని రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు.

ఇక హత్యకు వారం రోజుల ముందు ‘మనిషిని చంపడం ఎలా?’ అనే విషయంపై సాయికృష్ణ ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. తనను కోయంబత్తూర్‌కు తీసుకెళ్లాలని అంతకుముందు అప్సర పలుమార్లు కోరడంతో.. దానినే ఆమెను హత్య చేసేందుకు ఆసరా చేసుకున్నాడు. జూన్ 3వ తేదీన రాత్రి 9 గంటలకు కోయంబత్తూర్‌కు టికెట్ బుక్ చేశానని అప్సరను నమ్మించిన సాయికృష్ణ.. ఆమెను కారులో ఎక్కించుకుని రాత్రి 8.15 గంటలకు సరూర్‌నగర్ నుంచి బయల్దేరాడు.

రాత్రి 9 గంటలకు ఇద్దరూ శంషాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి చేరుకున్న తర్వాత టికెట్ బుక్ చేయలేదని చెప్పి.. అక్కడ్నుంచి గోశాలకు తీసుకెళ్లాడు. రాత్రి భోజనం కోసం రాళ్లగూడ వద్ద ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ వద్ద కారు ఆపారు. అప్పటికే ఆరోగ్యం బాగోలేక ఒకసారి వాంతి చేసుకుంది అప్సర.

అర్ధరాత్రి 12 గంటలకు ఇద్దరూ సుల్తాన్‌పల్లిలోని గోశాలకు చేరుకున్న ఆమె నిద్రిస్తున్న సమయంలో సాయికృష్ణ హత్య చేశాడు అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఆమె నిద్రిస్తున్న సమయంలోనే కారు కవర్‌తో ఊపిరాడకుండా చేసి, బండరాయితో బాది హత్య చేశాడు సాయికృష్ణ. కాగా, ఈ కేసులో నిందితుడిగా ఉన్న సాయికృష్ణను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. శంషాబాద్ పోలీసులు సాయికృష్ణను జడ్జి ఎదుట హాజరుపర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితుడిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.