National

రాయలసీమలోని ఆ జిల్లాలలో మొదలైన వజ్రాల వేట!!

తొలకరి వర్షాలు కురిశాయి అంటే ఆ ప్రాంత ప్రజలకు సంబరంగా ఉంటుంది..అది ఏరువాక సాగటానికి అనుకుంటే పొరపాటే. తొలకరి జల్లులు కురిస్తే రాయలసీమలోని కర్నూలు అనంతపురం జిల్లాలో రైతులు, ప్రజలు వజ్రాల కోసం వేట మొదలు పెడతారు.

ఈ సీజన్లో అదృష్టం ఎవరిని వరిస్తుందో అని ఆశగా వజ్రాల కోసం వెతుకులాట ప్రారంభిస్తారు.

ఈ సీజన్లో వజ్రాలు దొరికే అనంతపురం, కర్నూలు జిల్లాలలో ప్రజలు చాలా మంది పిల్లాపాపలతో వజ్రాల కోసం అన్వేషణ పెడతారు. ఈ రెండు జిల్లాల నుండే కాకుండా ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూలల నుండి, వైయస్ఆర్ జిల్లా, కర్ణాటక ప్రాంతాలనుండి కూడా వాహనాలలో వచ్చి ఇక్కడ వజ్రాన్వేషణలో చాలా మంది పాల్గొంటారు. రోజంతా పొలంలోనే ఉండి తళతళ మెరిసే రాళ్ల కోసం, వజ్రాల కోసం వెతుకుతూనే ఉంటారు.

ఒక్కొక్క పొలంలో 20 నుంచి 30 మంది వజ్రాన్వేషణలో సాగిస్తారు. ఒకవేళ వజ్రం దొరికితే వాటిని కొనుగోలు చేయడానికి వజ్రాల వ్యాపారులు కూడా అక్కడికి చేరుకొని సిద్ధంగా ఉంటారు. వజ్రం బరువు, రంగు, జాతిని బట్టి క్యారెట్ లలో లెక్కగట్టి డబ్బులు ఇస్తారు. ఈ రెండు జిల్లాలలో వజ్రాల కోసం అన్వేషణ ప్రతి సంవత్సరం జరిగే తంతే..

ఇక ఇటీవల కర్నూలు జిల్లాలో ఓ రైతుకు రెండు కోట్ల రూపాయల విలువైన వజ్రం దొరికింది. కర్నూలు జిల్లాలోని మద్దెకర మండలంలో బసినేపల్లి లో ఓ రైతుకు అత్యంత విలువైన వజ్రం దొరికింది. దానిని అమ్మకానికి పెట్టగా కొనడానికి వ్యాపారులు పోటీపడ్డారని సమాచారం. గతంలో కూడా కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం పగిడిరాయి, బొల్లవానిపల్లె పొలాల్లో ఇద్దరికి రెండు వజ్రాలు దొరికాయి.

ఇక అనంతపురంలోనూ అనేక మంది రైతులకు వజ్రాలు లభించాయి. అంతకుముందు చిన్న జొన్నగిరికి చెందిన ఒక రైతుకు ఒక కోటి 20 లక్షల రూపాయల విలువైన వజ్రం లభించింది. ఇక ఇప్పటికే రాయలసీమ జిల్లాలలో వజ్రాలు లభిస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా వజ్రాల నిక్షేపాల కోసం అన్వేషణ చేసింది. అయితే ఈ క్రమంలో రాయలసీమలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లుగా గుర్తించింది. 2013లో బంగారం నిక్షేపాల వెలికితీతకు జియో మైసూర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అనుమతి ఇచ్చింది.