National

పీఎం మోడీని పొగిడి.. వారికి 10కోట్ల విరాళం: మనీలాండరింగ్ కేసు నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్!!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఒడిశా రైలు ప్రమాద బాధితులకు పది కోట్ల రూపాయల విరాళం ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఒడిశాలోని బాలాసోర్ లో తాజాగా జరిగిన రైలు ప్రమాద ఘటనలో మృతిచెందిన బాధిత కుటుంబాలకు 10 కోట్ల రూపాయలను విరాళంగా పంపించారు.

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు తన లాయరు ద్వారా సుఖేష్ చంద్ర శేఖర్ ఈ చెక్కును పంపించారు. తాను న్యాయంగా సంపాదించిన దాని నుండే ఈ సహాయం చేస్తున్నానని సుఖేష్ చంద్ర శేఖర్ పేర్కొన్నారు. ఈ మేరకు సుఖేష్ చంద్రశేఖర్ రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ కు ఒక లేఖ రాశారు.

ఒడిస్సా రైలు ప్రమాద బాధితుల కోసం తాను పంపించిన 10 కోట్లను స్వీకరించడానికి అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. ఇది తన వ్యక్తిగత నిధి నుండి చట్టబద్ధమైన సంపాదన నుండి పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రమాదంలో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లల చదువుల కోసం ఈ నిధులు ఉపయోగించవచ్చని ప్రస్తుతం జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ తెలిపారు.