National

గుజరాత్, రాజస్థాన్‍లో భారీ వర్షాలు.. ఢిల్లీలో చల్లబడిన వాతావరణం

బిపార్జోయ్ తుఫాన్ కారణంగా శుక్రవారం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులతో భారీ వర్షాలు కురిశాయి. ఢిల్లీలో నేడు, రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

“దక్షిణ ఢిల్లీ (వసంత్‌కుంజ్, మాల్వియా నగర్, కల్కాజీ, తుగ్లకాబాద్, ఛత్తర్‌పూర్, ఇగ్నో, దేరమండి)లోని ప్రాంతాలలో 30-40 కిమీ/గం వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

తేలికపాటి నుంచి మోస్తరు తీవ్రతతో కూడిన వర్షం, ఉరుములతో కూడిన ఈదురు గాలులు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా భారత వాతావరణ శాఖ రాజస్థాన్‌లోని బార్మర్, జలోర్, జైసల్మేర్, సిరోహి, జోధ్‌పూర్, పాలి, సమీప ప్రతాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించింది. శక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నిన్న గుజరాత్‌లో తీరాన్ని తాకిన తీవ్ర తుఫాను బిపార్జోయ్ క్రమంగా బలహీనపడి మధ్యాహ్నం సమయంలో సౌరాష్ట్ర, కచ్ మీదుగా తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది.

ఆ తర్వాత దక్షిణ రాజస్థాన్‌పై శుక్రవారం సాయంత్రం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని IMD తెలిపింది. IMD హెచ్చరికల దృష్ట్యా, జోధ్‌పూర్ విశ్వవిద్యాలయం శుక్ర, శనివారాల్లో జోధ్‌పూర్ డివిజన్‌లోని అన్ని కళాశాలల్లో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు. బిపార్జోయ్ తుఫాన్ కారణంగా గుజరాత్ అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భీకర గాలులతో కుండపోతగా వర్షం కురుస్తోంది.

ద్వారక, కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా తీరానికి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 8 కోస్టల్ జిల్లాల్లోని 94 వేల మంది తాత్కాలిక షెల్టర్లలో తలదాచుకుంటున్నారని అధికారులు చెప్పారు. వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వరద పరిస్థితులపై గుజరాత్ సీఎంతో ఫోన్లో మాట్లాడారు. అన్ని విధాల ఆదుకుంటామన్నారు.