National

తమిళనాడు రాష్ట్రంలోని అరియలూరు జిల్లాలో ఘోర ప్రమాదం

తమిళనాడు రాష్ట్రంలోని అరియలూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో 10 మంది కార్మికులు మృతి చెందారు.

మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. వెట్రియార్‌కు చెందిన రాజేంద్రన్ యాజ్ ఫైర్ వర్క్స్ పేరిట ఓ బాణసంచా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో అందులో ఆకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఆ సమయంలో కార్మికులు టిఫిన్ చేస్తున్నారు. వారు అప్రమత్తమై ఫ్యాక్టరీ నుంచి బయటపడే లోపే మంటలు వ్యాపించాయి. దీంతో వారు మంటల్లో చిక్కుకుపోయారు.

ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు ఆర్పుతూనే.. స్థానికుల సాయంతో కార్మికులను బయటకు తీసుకొచచే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అరియలూరు ప్రభుత్వ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.

తీవ్రంగా గాయపడిన వారిని తంజావూరు మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఫ్యాక్టరీలో ఎంతమంది కార్మికులు ప్రమాద సమయంలో ఉన్నారనేదానిపైనా స్పష్టత లేదు. ప్రమాద సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ అన్నెమేరీ స్వర్ణ, ఎస్పీ కే ఫిరోజ్ ఖాన్ అబ్దుల్లా ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు.

మరోవైపు, బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం చోటు చేసుకుని కార్మికులు చనిపోయారన్న సమాచారం తెలుసుకున్న సీఎం ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 3 లక్షల పరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. లక్ష, స్వల్పంగా గాయపడినవారికి రూ. 50 వేలు సాయం అందిస్తామని ప్రకటించారు. కాగా, అక్టోబర్ 7న అత్తిబెలెలోని ఓ గోదాంలో భారీ ప్రమాదం చోటు చేసుకుని 14 మంది చనిపోయిన ఘటన మరువక ముందే ఈ విషాద ఘటన చోటు చేసుకోవడం శోచనీయం.