NationalPOLITICS

కేసీఆర్ నా గురువు, ఆయన బాగుండాలి: బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆదిలాబాద్: తెలంగాణలో త్వరలో పేదల రాజ్యం వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ఆదిలాబాద్‌లో మంగళవారం జరిగిన జన గర్జన సభలో ఆయన మాట్లాడారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు బండి సంజయ్.

రాష్ట్రంలో కేసీఆర్ రూ.5 లక్షల కోట్లు అప్పు చేశారని బండి సంజయ్ ఆరోపించారు. ఆ అప్పును ఎలా తీరుస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం అప్పు కేవలం మోడీ వల్లనే తీరుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తాం అంటుంది.. వాళ్లు రాష్ట్ర అప్పును ఎలా తీరుస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో యువత కోసం ఈ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ తనకు గురువన్న బండి సంజయ్.. ఆయనను చూసే తాను భాష నేర్చుకున్నట్లు తెలిపారు. సీఎం గత కొన్ని రోజులుగా కనిపించడం లేదని.. ఆయనకు ఏమైందో చెప్పాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు. సీఎం కేసీఆర్‌ను ఆయన కొడుకు ఏం చేస్తుండో అని తమకు భయంగా ఉందన్నారు బండి సంజయ్. కేసీఆర్‌కు రక్షణ కల్పించాలని.. ఆయన నిండు నూరేళ్లు బతకాలన్నారు. కేసీఆర్ ఎలా ఉన్నారో తమకు చూపించాలన్నారు బండి సంజయ్.

నిజాం మెడలు వంచి తెలంగాణకు స్వాతంత్ర్యం అందించిన ఘనుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే.. కేసీఆర్ మెడలు వంచి తెలంగాణ ప్రజల బతుకులు మార్చేందుకు అమిత్ షా వచ్చారన్నారు బండి సంజయ్. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలని ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రశ్నించారు.

బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగ భృతి, డీఎస్సీ, గ్రూప్-1 ఇవన్ని కలగానే ఉంటాయని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఇవన్ని రావాలి.. తెలంగాణ బాగుపడాలి.. అంటే బీజేపీ రాజ్యమే రావాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో వచ్చే మోడీ రాజ్యమేనని.. దాన్ని ఎవరూ ఆపలేరని బండి సంజయ్ అన్నారు.

మరోవైపు, కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్ సర్కారుపై విరుచుకుపడ్డారు. కేంద్రంలో ప్రధాని మోడీ హ్యాట్రిక్ సాధించబోతున్నారని ఆయన ధీమావ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతోందన్నారు. తెలంగాణ విమోచన ఉత్సవాలు మొదటిసారి అమిత్ ​షా ఘనంగా జరిపించారని తెలిపారు. ఎన్నికల ప్రకటన తర్వాత తొలి సభ ఆదిలాబాద్‌​లో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.