National

మహారాష్ట్రపై ఫుల్ ఫోకస్: కేసీఆర్ రెండ్రోజుల పర్యటన, కీలక నేతల చేరిక

హైదరాబాద్: మహారాష్ట్రపై భారత్ రాష్ట్ర సమితి(BRS) ప్రత్యేక ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపట్నుంచి(జూన్ 26) రెండు రోజులపాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు.

మహారాష్ట్రలోని పండరీపూర్, తుల్జాపూర్‌లో ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

అనంతరం షోలాపూర్‌లో నిర్వహించే పార్టీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు రోడ్డు మార్గాన హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు బయల్దేరి వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్ వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు భారీ కాన్వాయ్ గా తరలివెళ్లనున్నారు. సాయంత్రానికి షోలాపూర్ చేరుకుని.. రాత్రి అక్కడే బస చేస్తారు.

షోలాపూర్‌కు చెందిన ప్రముఖ నాయకుడు భగీరథ్ బాల్కే సహా పలువురు నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరనున్నారు. షోలాపూర్‌లోని పలువురు మహారాష్ట్ర నేతలు, తెలంగాణ నుంచి వెళ్లిన చేనేత కార్మికుల కుటుంబాలు కేసీఆర్‌ను కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

మంగళవారం ఉదయం షోలాపూర్‌లోని పండరీపూర్‌కు చేరుకుని అక్కడి విఠోభారుక్మిణి మందిర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తర్వాత దాదాశివ్ జిల్లాలోని శక్తిపీఠమైన తుల్జాభవానీ అమ్మవారిని దర్మించుకుని పూజలు చేస్తారు. అక్కడ్నుంచి హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలో తిరుగు ప్రయాణం అవుతారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

కాగా, ఇప్పటికే మహారాష్ట్రలో పలు బహిరంగ సభలను కేసీఆర్ నిర్వహించిన విషయం తెలిసిందే. మహారాష్ట్రపై ప్రత్యేక దృష్టి సారించిన కేసీఆర్.. వరుస సభలు నిర్వహిస్తూ పార్టీని విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రకు చెందిన పలు పార్టీల నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తాజాగా, మరికొంత ముంది కీలక నేతలు కూడా బీఆర్ఎస్‌లో చేరనున్నారు. మరోవైపు, మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరించడంపై ఎన్సీపీ నేతలు మండిపడుతుండటం గమనార్హం. తెలంగాణ ఎన్నికల్లో ఎన్సీపీ పోటీ చేస్తుందని చెబుతున్నారు.